జగన్‌ నుంచి ధర్మం తనను తాను రక్షించుకుంది!

జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల అరాచక పాలనను ప్రజలు తిరస్కరించారు. గత ఎన్నికలలో ఘోర ఓటమి తరువాత కూడా ఇసుమంతైనా మార్పు కనిపించని జగన్ ను చూసి ఇప్పుడు జనంఆయన రాజకీయాలలో కొనసాగడానికే అనర్హుడని తీర్మానించేసుకున్నట్లు కనిపిస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వినియోగం జరిగిందని వెల్లడి కాగానే.. వైసీపీ హయాంలో తిరుమలలో జరిగిన అపచారాలు, అఘాయిత్యాలు ఒక్కటొక్కటిగా గుర్తు చేసుకుంటూ, తిరుమల పవిత్రతకు భంగం కలిగించడమే లక్ష్యంగా జగన్ హయాంలో తిరమల తిరుపతి దేవస్థానం పని చేసిందని విమర్శలు చేస్తున్నారు. తిరుమల దేవుడిని నల్ల రాతితో పోల్చిన భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ గా జగన్ నిర్మించగానే అత్యధికులు అన్న మాట వినాశకాలే విపరీత బుద్ధే అన్నది. ఆ తరువాత భూమన చైర్మన్ గా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు దేవుడి సొమ్ముకే ఎసరు పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కుమారుడి ఎన్నికల ప్రచారం కోసం తిరుమల దేవుడి సొమ్మును వినియోగించడానికి ఆయన చేసిన ప్రయత్నాలను ఇప్పుడు ఎత్తి చూపుతున్నారు. 

తిరుమతి నుంచి వైసీపీ అభ్యర్థిగా భూమన కుమారుడు అభినయ్ రెడ్డి పోటీ చేస్తారని ఖరారు కాగానే.. అప్పటికి టీటీడీ చైర్మన్ గా ఉన్న భూమన కరుణాకరరెడ్డి ఎన్నికల నిధుల కోసం తిరుమల వెంకన్న సొమ్మును అప్పనంగా వినియోగించేసుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. తిరుమల తిరుమతి దేవస్థానం వార్షిక ఆదాయం నుంచి ఒక శాతం నిధులను తిరుపతి అభివృద్ధి కోసం కేటాయించాలంటూ టీటీడీ పాలకమండలి సమావేశంలో తీర్మానం పెట్టారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. తిరుపతి అభివృద్ధికి ఇప్పటికే టీటీడీ  అనేక అభివృద్ధి పనులు నిర్వహిస్తోంది. తిరుపతిలోని ప్రముఖ విద్య, వైద్య సంస్థలను టీటీడీ నిర్వహిస్తోంది. తిరుపతిలోని ప్రధాన రహదారుల నిర్వహణ టీటీడీదే. తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు తిరుమల తిరుపతి దేవస్థానం 350 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇంత చేస్తున్న టీటీడీ వార్షిక ఆదాయం నుంచి అదనంగా మళ్లీ ఒక శాతం తిరుపతి అభివృద్ధికి కేటాయించాలన్న తీర్మానం ఎందుకంటే అప్పట్లోనే భూమన ప్రతిపాదనను అందరూ వ్యతిరేకించారు. వాస్తవానికి కుమారుడుని అసెంబ్లీ ఎన్నికలలో గెలిపించుకోవడం కోసం భూమన దేవుడి నిధులను వినియోగించుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రతిపాదన చేశారు. 

ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండో.. జగన్ హయాంలో తిరమల తిరుపతి దేవస్థానాన్ని ఫక్తు వ్యాపార కేంద్రంగా, దోపిడీకి నిలయంగా మార్చేశారు. చివరాఖరికి తిరుమల గిరులను స్మగ్లింగ్ అడ్డాగా మార్చడానికి వణ్య ప్రాణుల భయాన్ని కూడా భక్తులలో కలిగించారు. అటవీ శాఖ వణ్య ప్రాణులను నడక మార్గంలో రాకుండా అదుపు చేయడం మాని, భక్తులకు కర్రలు ఇస్తాం మిమ్మల్ని మీరే  రక్షించుకోండి లేదా నడక మార్గంలో రావడం మానేయండి అన్నట్లు వ్యవహరించింది.  

ఇప్పుడు తిరుమల లడ్డూ తయారీలో  నెయ్యి కల్తీ వ్యవహారం వెలుగు చూడటంతో ఇది కూడా జగన్ ప్రభుత్వ నిర్వాకమే అన్న నిర్ధారణకు వచ్చేశారు. జగన్ హయాంలోనే రివర్స్ టెండరింగ్ కారణంగా తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కల్తీ చేసిన నెయ్యి పంపిణీ జరిగిందని అంటున్నారు. ఇక ఈ వ్యవహారంలో కూడా తనదైన అడ్డగోలు వ్యవహారంతో జగన్ తెలుగుదేశం, ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుపై నెపం నెట్టేలా ఎదురుదాడికి ఉపక్రమించారు. ఆ క్రమంలోనే తిరుమల టూర్ పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని వైసీపీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. 

తన తిరుమల పర్యటనను ప్రభుత్వం అడ్డుకుంటుందనీ, దాని వల్ల కావలసినంత పొలిటికల్ మైలేజ్ పొందవచ్చుననీ జగన్ భావించారు. ఆయన తిరుమల టూర్ ప్రకటన వెలువడిన క్షణం నుంచీ జరిగిన పరిణామాలను గమనిస్తే తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం తధ్యమనే అంతా భావించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తారనీ, ఆయన తిరుమలకు వెళ్లకుండా అలిపిరి వద్దనే అడ్డుకుంటారనీ, దీంతో ఉద్రిక్తతలు ఏర్పడి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. అయితే జగన్ పప్పులు ఉడకలేదు. తెలుగుదేశం కూటమి పార్టీలు జగన్ తిరుమల పర్యటనను అడ్డుకోబోమని విస్పష్టంగా ప్రకటించారు. అవే కాదు హిందూ సంస్థలు కూడా శాంతియుత నిరసనలకే పరిమితమౌతామని ప్రకటించాయి. ఆయన తిరుమల పర్యటనపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదనీ, అయితే నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని స్పష్టం చేశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా జగన్ తిరుమల దేవస్థానం కూడా జగన్ డిక్లరేషన్ ఇచ్చే తిరుమల దేవుడిని దర్శించుకోవాలని స్పష్టం చేసింది. ఇక్కడే జగన్ ఇబ్బంది పడ్డారు. తన పర్యటనను అడ్డుకోవడానికి అధికార తెలుగుదేశం కూటమి సర్వశక్తులూ సన్నద్ధం చేసుకుని సిద్ధమౌతుందనీ, ఆ సందర్బంగా శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందనీ జగన్ భావించారు. డిక్లరేషన్ ఇవ్వడానికి ఆయన ఎటూ సిద్ధంగా లేరు. అది పక్కన పెడితే  తన తిరుమల పర్యటన సందర్భంగా వివాదం, విధ్వంసం సృష్టించడం ద్వారా రాజకీయ లబ్ధి కోసం చేసిన ప్రయత్నం విఫలమవ్వడంతో మరో గత్యంతరం లేక తిరుమల టూర్ రద్దు చేసుకున్నారు. ఆ లోగానే టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకరరెడ్డి ద్వారా రాష్ట్రంలో ఘర్షణ వాతావరణం నెలకొనేలా ఇష్టారీతిగా మత విశ్వాసాలపై వ్యాఖ్యలు చేయించారు. అయితే జనం ఈ సారి  జగన్ ఉచ్చులో పడలేదు. భూమన వ్యాఖ్యలను పట్టించుకోలేదు. 

అటు ప్రభుత్వం కూడా ప్రజాస్వామ్య బద్ధంగా జగన్ టూర్ కు కాన్వాయ్ ని సిద్ధం చేసింది. దీంతో జగన్ తన టూర్ రద్దు చేసుకున్నారు. అయితే  ప్రభుత్వం తనను తిరుమల దేవుడి దర్శనానికి వెళ్లకుండా అడ్డంకులు సృష్ఠిస్తోందంటూ ఆరోపణలు చేయడానికి ప్రెస్ మీట్ పెట్టారు. అసందర్భంగా తననే దర్శనానికి వెళ్లకుండా అడ్డుకున్నారంటే ఇక దళితుల సంగతేంటంటూ కొత్త వివాదానికి తెరలేపడానికి ప్రయత్నించారు. అదీ ఫలించలేదు అది వేరే సంగతి.  కింద పడినా నాదే పై చేయి అనడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలు చూసి వైసీపీ శ్రేణులే నవ్వుకుంటున్నాయి. అసలు జగన్ తిరుమల పర్యటన వ్యవహారంలో దళితుల ప్రస్తావన ఎందుకన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన తిరుమల పర్యటనకు ఎటువంటి అడ్డంకులూ లేకపోయినా, పోలీసులు పూర్తి ఏర్పాట్లూ చేసినా సొంత కారణాలతోనే జగన్ తన పర్యటన రద్దు చేసుకున్నారు. తిరుమల దేవుడిపై విశ్వాసం ఉందన్న డిక్లరేషన్ ఇవ్వడానికి ఇష్టం లేకనే జగన్ తన పర్యటన రద్దు చేసుకున్నారు. ఇందులో మరో సందేహానికి తావే లేదు. భూమన కరుణాకర్ రెడ్డి జగన్ డిక్లరేషన్ ఇవ్వరు, ఇవ్వాల్సిన అవసరం లేదు. దర్శనానికి వెడతాం. ఎవరడ్డుకుంటారో చూస్తాం అంటూ చేసిన  రెచ్చగొట్టే వ్యాఖ్యలే జగన్ డిక్లరేషన్ ఇవ్వడానికి రెడీగా లేరనడానికి నిదర్శనం. 

ఇక ఆయన దళితుల అంశాన్ని అసందర్భంగా లేవనెత్తడ కూడా ఆయన పరువును నిట్టనిలువుగా గొయ్యి తీసి పాతేసినట్లైంది. ఎందుకంటే తిరుమలలో ఇప్పటి వరకూ దళితుల దర్శనం ఒక  ఇష్యూ అయిన సందర్భం లేదు. అన్యమతస్థులు డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి వెళ్లాలన్న నిబంధన ఇప్పటిది కాదు. ఎప్పటి నుంచో ఉంది. మాజీ రాష్ట్రపతి అబ్డుల్ కలాం వంటి వారు కూడా తిరుమల దేవుడిని దర్శించుకున్నారు. ఆ సందర్భంగా డిక్లరేషన్ ఇచ్చారు. తిరుమల దర్శనం విషయంలో ఆయన దళితుల అంశం లేవనెత్తడంతో ఆ వర్గాలలో కూడా జగన్ నవ్వుల పాలయ్యారు.  గత ఎన్నికలలో ఘోర ఓటమి తరువాత కూడా 40 శాతం ఓటు బ్యాంకు అంటూ గప్పాలు కొట్టుకుంటున్న జగన్ కు ఇప్పుడు నాలుగు శాతం ఓటు బ్యాంకైనా మిగులుతుందో లేదో అనుమానమే అంటున్నారు పరిశీలకులు. మొత్తంగా తన తిరుమల పర్యటన పేరుతో రాజకీయం చేద్దామనుకున్న జగన్ వ్యూహం ఫలించలేదు సరికదా.. ప్రతికూల ఫలితం వైసీపీ మనుగడకే ఎసరు తెచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.