ప్రత్యేక కోటాలో రోజాకు మంత్రి పదవి? దేవుడమ్మ చెప్పేసిందట? 

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఏ ఇద్దరు వైసీపీ నాయకులు కలిసినా, మంత్రివర్గ విస్త్రరణపైనే  మాట్లాడుకుంటున్నారు.నిజానికి మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుంది? ఎలా ఉంటుంది? మొత్తంగా పక్షాలన చేస్తారా? మార్పులు చేర్పులతో సరిపెడతారా? ఉన్న వాళ్ళలో ఎవరుంటారు? ఎవరు పోతారు? కొత్తగా ఎవరికి అవకాశం దక్కుతుంది? అదృష్టం ఎవరిని వరిస్తుంది? నష్ట జాతకులు ఎవరు?ఇలా మంత్రివర్గం చుట్టూనే, ‘రాజకీయ ముచ్చట్లు’ సాగుతున్నాయి. మరో వంక మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు.   

ప్రతిపక్షాల విమర్శలు, పత్రికలు, మీడియాలో వస్తున్న ప్రభుత్వ వ్యతిరేక వార్తలు, కథనాలను తిప్పికొట్టడంలో ప్రస్తుత మంత్రుల వాయిస్’ సరిపోవడం లేదని ముఖ్యమంత్రి ఒక స్థిరమైన అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఒకటి రెండు మంత్రివర్గ సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి ఇదే విషయంగా మంత్రులకు క్లాసు తీసుకున్నారని వార్తలొచ్చాయి. కొందరు మంత్రులు కనీసం తమ శాఖకు సంబంధించి వచ్చిన విమర్శలపై కూడా స్పందించడం లేదని ముఖ్యమంత్రి గట్టిగా మంలించారని, కొదరిని అయితే, తట్టాబుట్టా సర్దుకోమని ముఖం మీదనే చీవాట్లు పెట్టారని సమాచారం.

ఇలా మంత్రులు చేతకాని వాళ్ళు కావడం వల్లనే, ఏ శాఖకు సమబందించిన విషయం అయినా ప్రభుత్వ సలహాదారు హోదాల సజ్జల రామ కృష్ణా రెడ్డి మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వవలసి వస్తోంది. అయితే, ఇలా ‘సర్వం సజ్జల మయం’ కావడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని, దెప్పి పొడిచేందుకు ముల్లుకర్రతో ఎప్పుడూ సిద్దంగా  ఉండే, వైసీపీ రెబెల్ ఏపీ రఘురామ కృష్ణంరాజు సజ్జలఫై ఇప్పటికే సెటైర్లు పేల్చారు..రాష్ట్రంలో ఏ సమస్య అయినా ప్రభుత్వ సలహాదారు సజ్జలే మాట్లాడుతున్నారు. ప్రతి దాంట్లో సజ్జల దూరిపోతున్నారు. సజ్జల ఒక్కోసారి సీఎంగా కూడా వ్యవహరిస్తున్నారు. సజ్జల సకలశాఖ మంత్రిగా.. సకల విషయాలు చూస్తారా? అంటూ ర‌ఘురామ తమదైన స్టైల్’లో చురకలు వేశారు. వాతలూ పెట్టారు. 

ఈ నేపధ్యంలోనే, ఈసారి మంత్రి వర్గంలో నోరున్న నేతలకు ప్రత్యేక కోటా తప్పక ఉంటుందని అంటున్నారు.నోరున్న ఎమ్మెల్యేలు అంటే, ముందుగా ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా పేరే వినిపిస్తుంది. ప్రతిపక్షాలను ‘జబర్దస్త్’గా ఎదుర్కోవడంలోనూ ఆమె స్థానం ప్రత్యేకం. ఈ నేపధ్యంలో, గతంలో సామాజికవర్గ సమీకరణాల వల్ల మంత్రి పదవి దక్కని రోజాకు ఈసారి మంత్రి పదవి గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. అయితే, అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి రైట్ హ్యండ్ మ్యాన్’గా చెప్పుకునే  పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి రోజాకు అవకాశం దక్కకుండా చేసే అవకాశాన్ని కొట్టివేయలేమని అంటున్నారు. 

రోజా ఈసారి ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగా ఆమె ముఖ్యమంత్రిని సన్నం చేసుకోవడంతో పాటుగా ‘హస్త రేఖ’లను కూడా పరీక్షించుకుంటున్నారని సమాచారం. ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని తిరుపతి వచ్చిన సందర్భంగా కలిసి, ‘ఒక్క ఛాన్స్’ కోసం వేడుకున్నారని. ఆమె అనుచరుల సమాచారం. ముఖ్యమంత్రి ఆమెకు ఏమి చెప్పారో, ఏమో కానీ, ఆమె అక్కడి నుంచి నేరుగా తిరుమలకు వెళ్లి, వెంకన్న దేవుని వద్ద కూడా ఒక రిక్వెస్ట్  పెట్టి వచ్చారు. అంతటితోనూ ఆగకుండా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సహ పార్టీ నాయకుల ఆస్థాన జ్యోతిష్యురాలు దేముడమ్మను కలిశారు. తిరుపతి నుంచి నేరుగా  విజయనగరం జిల్లా మక్కువ మండలం పాపయ్యవలసలోని దేముడమ్మ ఆశ్రమానికి వెళ్లి  జ్యోతిష్యురాలిని కలిశారు. తన రాజకీయ భవిష్యత్ గురించి తెలుసుకునేందుకే ఎమ్మెల్యే రోజా దేముడమ్మను కలిసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హాస్త రేఖల్లో మంత్రి రేఖలు ఉన్నాయా ? లేవా? మంత్రి అయ్యే యోగం ఉందా? లేదా? అనే విషయంలోనే రోజా, జ్యోతిష్యురాలు దేవుడమ్మను కలిసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సారన్నా ఆమె కల ఫలిస్తుందా?లేక ఎమ్మెల్యే రోజా, జబర్దస్త్ రోజాగానే మిగిలి పోతారా అన్నది మరి కొద్ది రోజుల్లోనే తెలిసి పోతుంది.. అంతవరకు ఇంతే సంగతులు.