దేవర టార్గెట్ 100 కోట్లు..!

ఒకప్పుడు తెలుగు సినిమా రూ.100 కోట్ల గ్రాస్ రాబడితే గొప్ప అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు మొదటిరోజే రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టే స్థాయికి తెలుగు సినిమా ఎదిగింది. ముఖ్యంగా ప్రభాస్ (Prabhas) కి ఇది చాలా మామూలు విషయం అయిపోయింది. 'బాహుబలి-2', 'సాహో', 'ఆదిపురుష్', 'సలార్', 'కల్కి 2898 AD'.. ఇలా ఇప్పటికే ఐదు సార్లు ప్రభాస్ ఈ ఫీట్ సాధించాడు. 'బాహుబలి-2' అయితే మొదటిరోజే ఏకంగా రూ.200 కోట్ల గ్రాస్ రాబట్టింది. 'ఆర్ఆర్ఆర్' కూడా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినప్పటికీ, అది మల్టీస్టారర్. దీంతో, ప్రభాస్ తర్వాత సోలో హీరోగా మొదటి రోజు రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టే తెలుగు హీరో ఎవరనే ఆసక్తి నెలకొంది. అయితే ఈ ఫీట్ సాధించే అవకాశం జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కి ఉంది.

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'దేవర' (Devara). ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. 'దేవర' ఓవర్సీస్ బుకింగ్స్ కి కూడా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా యూఎస్ ప్రీమియర్ ప్రీ సేల్స్ లో ఇప్పటికే 1 మిలియన్ కి చేరువై సంచలనాలు సృష్టిస్తోంది. యూఎస్ లోనే ఇలా ఉంటే, తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ అయితే.. ఏ రేంజ్ రెస్పాన్స్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే కర్ణాటకలోనూ ఎన్టీఆర్ సినిమాలకు బ్రహ్మరథం పడతారు. 

ఎన్టీఆర్ కి 'కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్' అనే పేరుంది. ఆరేళ్ళ క్రితం ఎన్టీఆర్ నటించిన రీజినల్ మూవీ 'అరవింద సమేత'నే వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే రూ.60 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. అలాంటిది 'దేవర' పాన్ ఇండియా మూవీ. ఇప్పుడు టికెట్లు రేట్లు కూడా పెరిగాయి. పైగా 'ఆర్ఆర్ఆర్'తో ఎన్టీఆర్ మార్కెట్ ఎంతో పెరిగింది. సౌత్ తో పాటు నార్త్ ప్రేక్షకులు కూడా ఎన్టీఆర్ సినిమా పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఈ లెక్కన 'దేవర' మూవీకి మొదటి రోజు రూ.100 కోట్ల గ్రాస్ రావడం అనేది పెద్ద మ్యాటర్ కాదు. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఓవర్సీస్ ఇలా అన్ని చోట్లా 'దేవర'పై నెలకొన్న అంచనాలను బట్టి చూస్తే.. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.150 కోట్ల గ్రాస్ రాబట్టినా ఆశ్చర్యంలేదు అనిపిస్తోంది. అదే జరిగితే ప్రభాస్ తర్వాత అసలుసిసలు పాన్ ఇండియా స్టార్ గా ఎన్టీఆర్ పేరు తెచ్చుకుంటాడు.