తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

బంగ్లాదేశ్ నుంచి ఉత్తర బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఒడిశా వరకు, మహారాష్ట్ర నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు రెండు వేర్వేరు ఉపరితల ద్రోణులు ఏర్పడ్డాయి. అలాగే ఉత్తరాంధ్రను ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాలలో  వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఆవర్తనాలకు తోడు రుతుపవనాల కదలిక కూడా చురుకుగా ఉండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.  

సోమవారం తెలంగాణలోని పలు ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయనీ, ఆ సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వరకూ వేగంగా ఈదురుగాలులు వీస్తాయనీ పేర్కొంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే  వచ్చే 24 గంటల్లో  శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు,నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో  ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయనీ, మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లకుండా ఉంటే మంచిదని వాతావరణ శాఖ పేర్కొంది.