పగటి కలలా? మానసిక రుగ్మతా.. జగన్ వింత ప్రవర్తనకు కారణమేంటి?

కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నించడం అని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ పిలుపు నిచ్చారు. అయితే మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మాత్రం తాను కలలు కంటాననీ, వాటిలోనే జీవిస్తాననీ, అదే వాస్తవమని తాను నమ్మడం కాకుండా, పార్టీ నేతలు, క్యాడర్, ప్రజలూ కూడా నమ్ముతున్నారని భ్రమ పడుతున్నారు. జగన్ ఐదేళ్ల అరాచక పాలనపై ప్రజలు తమ వ్యతిరేకతను, ఆగ్రహాన్ని గత ఏడాది జరిగిన ఎన్నిలలో విస్పష్టంగా చాటారు. ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ దీనంగా కోరిన జగన్ కు ఆ చాన్స్ ఇచ్చి అధికారం కట్టబెట్టినందుకు తమను తాము తిట్టుకుంటూ ఐదేళ్లు గడిపిన ప్రజలు.. ఐదేళ్ల తరువాత ఎన్నికలు రాగానే జగన్ ఇక చాలు.. నీకు మరో చాన్స్ లేదని విస్పష్టంగా చాటేలా ఓట్లు వేశారు. అందుకే ఆయన పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికలలో కేవలం 11 అంటే 11 సీట్లు మాత్రమే వచ్చాయి. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఆ ఎన్నికల్లో జగన్ కు ఆయన అండ చూసుకుని విర్రవీగిన ఆయన పార్టీ నేతలకూ గట్టి బుద్ధి చెప్పారు. 

సరే జగన్ ప్రభుత్వం పతనమై చంద్రబాబు సారథ్యంలో తెలుగుదేశం కూటమి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆరు నెలలు దాటింది. చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో ప‌రుగులు పెట్టిస్తోంది. ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాల్లోని ప్ర‌జ‌లు ప్ర‌భుత్వ ప‌ని తీరు ప‌ట్ల ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతుకుల ర‌హ‌దారుల‌ స్థానంలో అద్దాల్లాంటి రోడ్లు దర్శనమిస్తున్నాయి. ఐదేళ్లు రాష్ట్రం వైపు చూడడానికే భయపడిన పెట్టుబడి దారులు ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. రాష్ట్రానికి ప్ర‌పంచ స్థాయి కంపెనీలు తరలి వస్తున్నాయి. చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ సార‌థ్యంలో  రాష్ట్రం ప్రగతి పథంలో పరుగులు పెడుతుందన్న జనం బలంగా విశ్వసిస్తున్నారు. అయితే ప్రజల ఆకాంక్షలు, అభీష్ఠాలతో ఏ మాత్రం సంబంధం లేని, మాజీ  మయుఖ్యమంత్రి, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే అయిన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం తన అధికార వియోగం తాత్కాలికమేననీ,  కొద్ది రోజులలోనే లేకుంటే కొద్ది నెలల్లోనే మళ్లీ తానే ముఖ్యమంత్రిని అవుతాననీ తాను నమ్మడమే కాకుండా అందరూ నమ్మి తీరాలంటున్నారు.  

ఐదేళ్లు ముఖ్య‌మంత్రిగా ఉండి..  ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై అక్ర‌మ కేసులు బనాయించి జైలు పంపించ‌డం, ప‌ర‌దాలు క‌ట్టుకొని బ‌య‌ట‌కు రావ‌డం, ప్ర‌భుత్వ ప‌నితీరును ప్ర‌శ్నించిన వారిపై దాడులు చేయించ‌డం, సొంత మీడియా, సోష‌ల్ మీడియా ద్వారా ఆడ‌వారిపై కూడాఅస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టించ‌డం చేసిన జ‌గ‌న్‌.. ప్ర‌జ‌ల‌చేతిలో చావుదెబ్బ‌తిన్నా బుద్ధి మార్చుకోలేదు.  కనీసం ప్రతిపక్ష  హోదా కూడా లేక‌పోయినా అహంకార పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాత్రిళ్లు దేవుడు క‌ల‌లోకి వ‌చ్చి చెప్పిన‌ట్లు ఈ ప్ర‌భుత్వం ఎక్కువ రోజులు ఉండ‌దు అంటూ అధికారుల‌పై బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నాడు. అధికారం కోల్పోయి ఏడాదికూడా కాక‌ముందే .. మ‌రికొద్ది రోజుల్లో అధికారంలోకి వ‌స్తున్నామంటున్న జ‌గ‌న్ తీరును చూసి వైసీపీ నేతలూ, శ్రేణులే తలలు బాదుకుంటున్నాయి. ఆయన మానసిక స్థితిపై వారిలో  అనుమానాలు పెరుగుతున్నాయి. ప్రచారంలో ఉన్నట్లుగా జగన్ కు ఏదైనా మానసిక రుగ్మత ఉందా అన్న సందేహాలు వైసీపీ నుంచే వ్యక్తం అవుతున్నాయి. 

ఎన్నిక‌ల్లో అధికారం కాల్పోయిన ఏ పార్టీ అయినా.. త‌మ పాల‌న‌లో ఎక్క‌డ పొర‌పాట్లు జ‌రిగాయి.. ప్ర‌జ‌లు ఎందుకు మ‌న‌ల్ని ఓడించారు అన్న విషయాలపై సమీక్షలు చేసుకుంటుంది.  మ‌రోసారి అలాంటి పొర‌పాట్లు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డుతుంది. కానీ వైసీపీ అధినేత  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం అటువంటి వాటి జోలికి పోవడం లేదు.  అధికారం కోల్పోయిన నెల రోజుల నుంచే మళ్లీ మేమే అధికారంలోకి వ‌స్తాం.. అప్పుడు మీ అంతు చూస్తాం అంటూ అధికారుల‌బెదరింపులకు దిగడం మొదలు పెట్టారు. ఇక్కడ జగన్ మానసిక పరిస్థితిపై ప్రజలలో కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  జ‌గ‌న్ అధికారం కోల్పోయిన నాటి నుంచి అధికారుల‌ను బెదిరిస్తూ భ‌య‌బ్రాంతుల‌కు గురిచేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మొట్ట‌మొద‌టి అసెంబ్లీ స‌మావేశాల స‌మ‌యంలో త‌న‌ను నేరుగా అసెంబ్లీలోకి పంపించ‌డం లేద‌ని మ‌ధుసూద‌న్ రావు అనే అధికారిని జ‌గ‌న్ బెదిరించారు.  ఆ తరువాత తిరుప‌తి మాజీ ఎస్పీ సుబ్బారాయుడిపైనా బెదరింపుల పర్వానికి దిగారు. మేం అధికారంలోకి రాబోతున్నాం.. అప్పుడు నువ్వు ఎక్క‌డికిపోయినా  తీసుకొచ్చి నీ అంతుతేలుస్తాం అంటూ జ‌గ‌న్ హెచ్చరికలు జారీ చేశారు. ఇక తాజాగా పులివెందుల‌లో డీఎస్పీ ముర‌ళీనాయ‌క్ కు సైతం జ‌గ‌న్ వార్నింగ్ ఇచ్చారు. 
తనకు వరసకు సోదరుడైన వైఎస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియల సందర్భంగా సతీసమేతంగా పులివెందుల  వ‌చ్చిన జ‌గ‌న్‌.. కార్యక్రమం అనంతరం వెళ్లిపోయే సమయంలో తన హెలీప్యాడ్ వద్దకు డీఎస్పీ మురళీనాయక్‌ను పిలిపించుకుని మరీ వార్నింగ్ ఇచ్చారు.  వైసీపీ అధికారంలోకి వ‌స్తుంది ఏపీలో నువ్వు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.

జ‌గ‌న్ అధికారంలో ఉండి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, లోకేశ్ లాంటి నేత‌లు ఎవ‌రైనా అధికారుల‌పై ఇలా బెదిరింపుల‌కు పాల్ప‌డితే వెంట‌నే పోలీసు అధికారుల సంఘం నేత‌లు ప్రెస్ మీట్లు పెట్టి వార్నింగ్ ఇచ్చేవారు. కానీ జ‌గ‌న్ వ‌రుస‌గా అధికారుల‌ను బెదిరిస్తున్నా పోలీసు అధికారుల‌ సంఘాల నేత‌లు ప‌ట్టించుకోక‌పోవ‌టంతో ప్ర‌జ‌లుసైతం ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు కూట‌మి ప్ర‌భుత్వం కూడా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌టం లేద‌న్న వాద‌న ఉంది. ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌గ‌న్ తీరుపై స్పందిస్తూ.. అధికారుల‌ను బెదిరిస్తే ఊరుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు. అయినా జ‌గన్ ఏమాత్రం వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. అధికారం కోల్పోయినా అహంకార పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో జ‌గ‌న్‌పైచ‌ర్య‌లు తీసుకోవాల‌న్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.  జ‌గ‌న్‌ తీరుపై కూట‌మి ప్ర‌భుత్వం ఏ విధంగా స్పందిస్తుంద‌నేది వేచి చూడాల్సిందే.