సోనూసూద్‌ పేరుతో ఛీటింగ్.. ఆన్‌లైన్‌లో పైసా వసూల్..

కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రముఖుల పేర్లు వాడుకొని విచ్చలవిడిగా మోసాలకు దిగుతున్నారు. లాక్ డౌన్ టైమ్ లో అవసరంలో ఉన్న వారికి సాయపడుతూ వార్తల్లో నిలిచారు హీరో సోనూసూద్. ఆ తర్వాతా సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా.. తోచిన మేర సాయం చేస్తున్నారు. దేశంలో ఇప్పుడు సోనూసూద్ ఫుల్ పాపులర్ పర్సన్. అందుకే, జనాలు ఈజీగా బుట్టలో పడతారని సోనూసూద్ పేరుతో మోసాలకు తెగబడుతున్నారు కంత్రీగాళ్లు. 

పక్కా ప్లాన్డ్ గా ట్రాప్ చేస్తున్నారు మోసగాళ్లు. గూగుల్ లో సోనూసూద్ హెల్పింగ్ ఫౌండేషన్ పేరుతో లింక్ క్రియేట్ చేస్తున్నారు. ఫేక్ నెంబర్లతో ఛీటింగ్ కు పాల్పడుతున్నారు. తాజాగా.. హైదరాబాద్ కు చెందిన ఒకరి నుంచి 60 వేలు కాజేశారు. సైబరాబాద్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి సోనూసూద్‌ హెల్పింగ్‌ ఫౌండేషన్‌ కాంటాక్ట్‌ నంబర్‌ కోసం గూగుల్‌లో వెతికితే బలరామ్‌ పేరుతో ఓ నంబర్‌ కనిపించింది. ఫోన్‌ చేయగా, అవతలి వ్యక్తి సోనూసూద్‌ ఫౌండేషన్‌ అడ్వైజర్‌గా పరిచయం చేసుకున్నాడు. బాధితుడు తనకు సోనూసూద్ నుంచి 10వేలు సాయం కావాలని అడిగాడు. బలరామ్ పేరుతో కాంటాక్ట్ లోకి వచ్చిన మోసగాడు.. బాధితుడి వివరాలు సేకరించాడు. ఆ తర్వాత బలరామ్‌ మరోసారి ఫోన్‌ చేసి ‘సోనూసూద్‌ మీకు 50 వేలు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు. రిజిస్ట్రేషన్‌ ఫీజు, జీఎస్టీ కింద 8,300 కట్టాలని చెప్పాడు. నిజమేనని అనుకున్న బాధితుడు అతను చెప్పిన అకౌంట్లో డబ్బులు డిపాజిట్‌ చేశారు. మోసగాడు మరోసారి ఫోన్‌ చేసి ‘నేను చెప్పినట్లు డబ్బులు ఇస్తే, సోనూసూద్‌ నుంచి మూడున్నర లక్షలు ఇప్పిస్తానంటూ బేరం పెట్టాడు. సరేనని.. విడతలవారీగా 60 వేలు అతని ఖాతాలో జమ చేశాడు. ఇంకా డబ్బులు కావాలని అడగటంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేయగా.. కేటుగాళ్లు గూగుల్‌లో నకిలీ నంబర్లు అప్‌లోడ్‌ చేసి సోనూసూద్ పేరుతో సైబర్‌ నేరానికి పాల్పడుతున్నట్టు గుర్తించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.