ఆగని ఎర్రచందనం స్మగ్లింగ్
posted on May 30, 2015 9:18AM
శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ ను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తున్నా మరోవైపు స్మగ్లర్లు యదావిధిగా తమ స్మగ్లింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారని నిన్న మరొకమారు రుజువు అయింది. పోలీసులు నిఘా పెరగడంతో ఎర్రచందనం స్మగ్లర్లు ఈసారి తీర్ధ యాత్రికుల వేషంలో తమ పని చక్కబెట్టుకోవడానికి బయలుదేరడం విశేషం. తమిళనాడుకి చెందిన 72మంది కూలీలను, వారు ప్రయాణిస్తున్న బస్సులో దాచిన 77 ఎర్రచందనం దుంగలను, కత్తులు, గొడ్డళ్ళను నిన్న కడప జిల్లా సుండుపల్లి పోలీసులు చిన్నమండెం గ్రామం వద్ద పట్టుకొన్నారు. వారందరూ కడప జిల్లాలో సుండుపల్లె అటవీ ప్రాంతంలో ఎర్రచందనం చెట్లను నరికేందుకు వెళుతున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారినందరినీ రాయచోటి పోలీస్ స్టేషన్లో విలేఖర్ల ముందు ప్రవేశపెట్టారు. తమిళనాడుకి చెందిన అరుణాచలం అనే ఎర్రచందనం స్మగ్లర్ వారి వెనుక ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు.