ఒక్కరోజే 780మంది బలి.. కరోనా కల్లోలం
posted on Apr 9, 2021 11:34AM
10 రోజుల క్రితం రోజుకు 30వేల కేసులు. వారం గడిచే సరికి లక్షా 30వేల కేసులు. వామ్మో.. దేశంలో కరోనా ఓ రేంజ్‌లో విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులతో పాటు మరణాలూ భారీగా నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో ప్రాణాలను బలి తీసుకుంటోంది. లేటెస్ట్‌గా, వైరస్ ధాటికి 780మంది మృత్యువాత పడ్డారు. కరోనా రెండోదశలో ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి.
పాజిటివ్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పైపైకి పాకుతున్నాయి. తాజాగా.. 1,31,968 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఇప్పటి వరకూ మొత్తం కేసుల సంఖ్య కోటి 30 లక్షలు దాటేసింది. మృతుల సంఖ్య 1,67,642 మంది.
ప్రస్తుతం దేశంలో 9,79,608 క్రియాశీల కేసులుండగా.. ఆ రేటు 7.04 శాతానికి చేరింది. మరోవైపు కోలుకునే వారి సంఖ్యా క్రమంగా పడిపోతోంది. ఇప్పటివరకు 1,19,13,292 మంది కోలుకున్నారు. రికవరీ రేటు గతంలో 97శాతంగా ఉండగా.. ప్రస్తుతం రికవరీ రేటు 91.22 శాతానికి పడిపోవడం కలవరానికి గురి చేస్తోంది.
దేశంలో నమోదవుతున్న కేసులు, మరణాల్లో సగానికి పైగా మహారాష్ట్ర నుంచే ఉంటున్నాయి. గడిచిన 24 గంటల్లో అక్కడ 56 వేలకుపైగా కేసులు నమోదు కాగా.. 376 మంది చనిపోయారు. గత నెల రోజులుగా దేశంలోని 63 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. ఏప్రిల్ 8 వరకు 9,43,34,262 మందికి టీకా డోసులు వేశారు. గురువారం 36,91,511 మందికి టీకాలు ఇచ్చారు. ఈ నెల 11 నుంచి 14 తేదీల మధ్య టీకా ఉత్సవం నిర్వహించి, అర్హులందరికీ టీకాలు అందించాలని ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు.