తెలంగాణ పై కరోనా పంజా.. పాజిటివ్ కేసులలో కొత్త రికార్డ్

తెలంగాణలో కరోనా తన పంజా బాగానే విసురుతోంది. నిన్న ఒక్క రోజులోనే 1892 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో ఒక్క హైదరాబాద్ పరిధిలోనే 1685 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ లో మొత్తం కేసుల సంఖ్య 20,462 కు చేరుకున్నాయి. ఇందులో కరోనా తో పోరాడి 10,195 మంది కోలుకోగా 283 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం తెలంగాణలో 9,984 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఐతే నిన్న 1126 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 5,965 శాంపిల్స్‌ సేకటించి పరీక్షించారు. వీరిలో 4,073 మందికి నెగెటివ్ రాగా 1,892 మందికి పాజిటివ్ గా తేలింది. ఐతే ప్రైవేట్ ల్యాబ్స్‌లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తున్నాయని ప్రభుత్వం చెబుతోంది. మరి ముఖ్యంగా ఒక ల్యాబ్‌లో చేసిన టెస్ట్ లలో ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని తెలిపింది. దీంతో శుక్రవారం జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. ఇప్పటివరకు తెలంగాణలో 1,04,118 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.