తెలంగాణలో మ‌రో 49 మందికి పాజిటివ్‌! 453కు చేరిన క‌రోనా కేసులు!

బుధ‌వారంనాడు 49 మందికి పాజిటివ్ రావ‌డంతో తెలంగాణాలో పాజిటివ్ వ‌చ్చిన వారి సంఖ్య 453కు చేరింది. 
రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంద‌ని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అయితే ఇప్ప‌ట్టి వ‌ర‌కు 45 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 397 మంది చికిత్స పొందుతున్నట్లుగా మంత్రి వెల్లడించారు. చికిత్స పొందుతున్న వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని ఈటల రాజేందర్ వెల్లడించారు.

ఢిల్లీ మ‌ర్క‌జ్‌కు వెళ్లి వచ్చిన 1,100 మందికి పరీక్షలు చేశామని తెలిపారు. వారు సొంత ప్రాంతాలకు వచ్చాక, దగ్గరగా మెలిగిన 3,158 మందిని వివిధ ప్రాంతాల్లోని 167 క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించామని వెల్లడించారు. వీరిలోనూ కరోనా పరీక్షల కోసం తీసుకున్న 535 నమూనాలకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉందని మంత్రి తెలిపారు.

రాష్ట్రంలో అత్య‌ధికంగా హైద‌రాబాద్‌లో 161 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. అయితే వీరిలో 21 మంది చికిత్స త‌రువాత కోలుకుని ఇళ్ల‌కు వెళ్లిపోయార‌ని మంత్రి తెలిపారు. నిజామాబాద్‌లో 39 మందికి, రంగారెడ్డిలో 27 మందికి. వ‌రంగ‌ల్ అర్బ‌న్‌లో 23 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని మంత్రి ఈటెల తెలిపారు.

తెలంగాణలో ప్రస్తుతం 80 వేల పీపీఈ (పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్) కిట్లు ఉన్నాయని.. మరో 5 లక్షల కిట్లకు ఆర్డర్ ఇచ్చినట్లు వివరించారు. ప్రస్తుతం లక్ష N-95 మాస్క్‌లు ఉంటే మరో 5 లక్ష మాస్క్‌లను తెప్పిస్తున్నామని చెప్పారు. 2 కోట్ల సర్జికల్ మాస్క్‌లు సహా, కోటి చేతి గ్లౌజులు, రక్షణ కోసం 5 లక్షల గాగుల్స్ సైతం ఆర్డర్ ఇచ్చినట్లు మంత్రి చెప్పారు.