దేశంలో కరోనా వాక్సిన్ పంపిణీకి ప్లాన్ సిద్ధం చేసిన కేంద్రం.. ముందుగా వారికే..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పలు అంతర్జాతీయ సంస్థలు వ్యాక్సిన్ పై పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో కొన్ని చివరి దశ ట్రయల్స్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మనదేశంలో వ్యాక్సిన్ పంపిణీ కోసం కార్యాచరణను సిద్ధం చేసింది. అంతేకాకుండా మొట్టమొదటిగా ఈ వ్యాక్సిన్ ఎవరెవరికి ఇవ్వాలన్న దానిపై కూడా స్పష్టమైన ఒక అవగాహనకు వచ్చింది. దేశంలోని దాదాపు 30 కోట్ల మందికి మొదటగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వైద్య, ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారికి, వృద్దులకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

 

దేశంలోని 2 కోట్ల మంది రక్షణ సిబ్బంది, 70 లక్షల మంది వైద్య, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, 26 లక్షల మందికి పైగా సాధారణ ప్రజలు (50 ఏళ్లకు పైబడినవారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న 50 ఏళ్ల లోపు వ్యక్తులు) ఈ జాబితాలో ఉన్నారు. దీనికోసం బూస్టర్ డోస్ తో కలిపి మొదటి విడతలో 60 కోట్ల వ్యాక్సిన్ డోసులు అవసరమవుతాయని కేంద్రం భావిస్తోంది. మొదటి దశలో వ్యాక్సిన్ అందుకునేవారి జాబితా అక్టోబరు నెలాఖరుకు గాని లేదంటే నవంబరు మొదటివారం నాటికి గాని సిద్ధమవుతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.