నష్టపరిహారం సొమ్మూ స్వాహా.. జగన్ సర్కార్ నిర్వాకం
posted on Apr 29, 2022 12:39PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక ఉగ్రవాదిగా వ్యవహరిస్తున్నది. ఉచితాల కొనసాగింపు కోసం మరణించిన వారి కుటుంబాలకు ఇవ్వాల్సిన నష్టపరిహారం నిధులను సైతం జగన్ సర్కార్ పక్కదారి పట్టిస్తున్నది. కరోనా మృతుల కుటుంబాలకు అందాల్సిన ఆర్థిక సాయం వారికి అందించకుండా మళ్లించడంపై సుప్రీం కోర్టు ఏపీ ప్రభుత్వాన్ని మందలించింది. ఒక విధంగా చెప్పాలంటే గట్టి వార్నింగ్ ఇచ్చింది. కరోనా మృతుల కుటుంబాలకు అందాల్సిన నష్టపరిహారం నిధులు మళ్లించడంపై ఏపీ సర్కార్ ను నిలదీసింది. మే 13లోగా సమగ్ర వివరాలతో అఫిడవిట్ ధాఖలు చేయాలని ఏపీ సీస్ కు నోటీసులు జారీ చేసింది. అంతే కాకుండా అఫిడవిట్ దాఖలుకు ఇదే చివరి అవకాశమని హెచ్చరించింది. జగన్ సర్కార్ ఆర్థిక అవకతవకలపై ఇప్పటికే పలు మార్లు కోర్టు మొట్టి కాయలు వేసిన సంగతి తెలిసిందే. చివరికి కరోనా మృతుల కుటుంబాలకు అందాల్సిన సొమ్మును కూడా మళ్లించడంపై సుప్రీం కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ఎస్ డి ఆర్ ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్) నిధులను పిడి (పర్సనల్ డిపాజిట్) ఖాతాలకు మళ్లించడం డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్‌తో పాటు అప్రాప్రియేషన్ యాక్ట్‌ను ఉల్లంఘించడమేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విపత్తు నిధుల దారిమళ్లింపుపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని కోర్టు ఉదహరించింది. ఇప్పటికే పీడీ ఖాతాల్లోకి తరలించిన నిధులను డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద వినియోగించవద్దని పేర్కొంది.
మొత్తం మీద జగన్ సర్కార్ ఆర్థిక అవకతవకలపై కోర్టు ఎన్ని మార్లు మందలించిన ప్రభుత్వం తీరు మారడం లేదు.
ఎక్కడా అప్పుపుట్టని పరిస్థితిలో నిధుల మళ్లింపు వినా మరో మార్గం లేకపోవడంతో వైసీపీ సర్కార్ కార్పొరేషన్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ వంటి సంస్థల నిధులను మళ్లించి పబ్బం గడుపుకుంటున్నది. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ నిధులను ఆ విధంగానే మళ్లించింది. పంచాయతీ రాజ్ కే కేంద్రం విడుదల చేసిన నిధులనూ మళ్లించి ఉచితాలకు వెచ్చించేయడంతో గ్రామస్థాయిలో కనీస పనులు చేయడానికి కూడా నిధులు నిండుకున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం కూడా ఏపీకి రుణ మంజూరు అనుమతి ఇవ్వలేదు. తాజాగా కరోనా నిధుల మళ్లింపుపై ఏపీ సర్కార్ ను సుప్రం మందలించింది.