పులివెందులలో చంద్రబాబు బర్త్‌డే.. కేసులతో వేధింపు.. దంపతుల ఆత్మహత్యాయత్నం
posted on Apr 29, 2022 12:24PM
వారు చేసిన తప్పల్లా ఒక్కటే. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం. అంతే. ఆ మాత్రం దానికే.. కక్ష కట్టారు అధికార పార్టీ నేతలు. ఈ వేడుక జరిగింది జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గం కావడంతో ఉలిక్కిపడ్డారు. లేనిపోని కేసులతో ఆ దంపతులను వేధించారు. ఇప్పటికే పలు కేసులతో ఆ కుటుంబాన్ని ఆగమాగం చేస్తుండగా.. తాజాగా మరో కేసు బనాయించడంతో.. తట్టుకోలేకపోయిన ఆ దంపతులు ఆత్మహత్య యత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. దీంతో.. పోలీసులపై ప్రైవేట్ కేసు పెట్టేందుకు సిద్ధమవుతోంది టీడీపీ. ఇంతకీ అసలేం జరిగిందంటే... పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట మండలం చెరువుకాంపల్లెలో టీడీపీకి చెందిన రామాంజనేయులు, కృష్ణవేణి దంపతులు ఇటీవల చంద్రబాబునాయుడి పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో కేక్ కట్‌చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఇది గిట్టని స్థానిక వైసీపీ నేత సురేష్.. తన భార్య పద్మజతో దంపతులపై అక్రమ కేసులు బనాయించినట్టు బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు.
పోలీసుస్టేషన్‌కు రావాలంటూ సచివాలయం మహిళా కానిస్టేబుల్ ఒత్తిడి తెస్తుండటంతో తీవ్ర మనస్తాపం చెందిన దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆ భార్యాభర్తలపై గతంలోనూ ఇలాగే రెండు అక్రమ కేసులు పెట్టారని, తరచూ పోలీసులు ఇంటికి రావడాన్ని అవమానంగా భావించి సూసైడ్ అటెంప్ట్ చేశారని చెబుతున్నారు. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
అయితే, సూసైడ్ అటెంప్ట్ చేయడం చట్టప్రకారం నేరమంటూ మరో కేసు పెట్టేందుకూ పోలీసులు సిద్దమవుతున్నారనే తెలుస్తోంది. కుటుంబ గొడవలు కారణం కావొచ్చని.. పోలీసులు ఇష్యూను సైడ్‌ట్రాక్ పట్టిస్తున్నారని అంటున్నారు. సీఎం జగన్, ఎంపీ అవినాశ్‌రెడ్డి దగ్గర మెప్పు పొందడానికి తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపించారు. ఈ ఘటనను చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. పోలీసులపై ప్రైవేటు కేసులు పెట్టనున్నట్టు తెలిపారు.