ఉచిత హామీలను లంచాలుగా పరిగణించాలంటూ సుప్రీంలో పిటిషన్
posted on Oct 16, 2024 11:36AM
ఎన్నికల సమయంలో రాజకీయపార్టీలు ఉచితాలను ప్రకటించడం సర్వసాధారణంగా మారిపోయింది. అయితే అలా ఉచితాలను ప్రకటించడాన్ని లంచాలుగా ప్రకటించాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ ను సుప్రీం విచారణకు స్వీకరించింది. రాజకీయపార్టీలు ప్రకటించే ఉచితాలను లంచాలుగా ప్రకటించాలని బెంగుళూరులో చెందిన శశాంక శ్రీధర ఆ పిటిషన్ దాఖలు చేసారు. ప్రధానన్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆ పిటిషన్ ను విచారించనుంది.లోక్ సభ,అసెంబ్లీ ఇతర ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచితాలను కట్టడి చేసి కఠినచర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్ లో శ్రీధర పేర్కొన్నారు. గతంలో ధాఖలైన పిటిషన్లను కూడా పరిగణలోకి తీసుకుని అన్నీ కలిపి విచారణ చేస్తామని ధర్మాసనం తెలిపింది. ఉచితాలపై అభిప్రాయం తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కు నోటీసులు జారీ చేసింది.
ఉచితాలపై చాలా కాలం నుంచి విమర్శలువస్తున్నాయి. ఉచితాలు ఓటర్లను ప్రలోభపెట్టే సాధనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.ఉచితాలపేరుతో ప్రజలను పనిదొంగలుగా ఈ ప్రభుత్వాలు తయారు చేస్తున్నాయని, ఉపాధి కల్పించాల్సి ఉండగా ఉచితాలపేరుతో వారిని ప్రలోభాలకు గురి చేస్తున్నారు.అలాగే ఈ ఉచిత హామీల అమలు పేరు చెప్పి ప్రభుత్వాలు ఖజానాను ఖాళీ చేస్తున్నాయి.
గత వైసీపీ హయాంలో రాష్ట్ర ఆదాయం మొత్తం ఈ ఉచితాల అమలుకే సరిపోయిందని,ఫలితంగా అభివృద్ధికి చోటులేకుండా పోయిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి అలవి కాని హామీలు ఇస్తున్నాయి.ఆ తరువాత వాటిని అమలు జరిపే విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ రుణమాఫీ అమలు పూర్తిస్థాయిలో జరగలేదని విపక్షాలు ఆందోళనకు దిగిన విషయం విదితమే.
అలాగే ఇంతవరకూ రైతుబంధు ప్రకటించలేదు. ప్రభుత్వాలు పేదలకుచేయూత ఇవ్వాలి. ఉచి తాలతో కాకుండా ఉపాధి కల్పిస్తే వారు వారి కాళ్లమీద వారు నిలబడతారు. అయితే రాజకీయపార్టీలు దొడ్డిదారిని ఎంచుకుని దీర్ఘకాలిక ప్రయోజనాలు వదిలేస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మించడానికి నిధులులేక,కేంద్రాన్ని అడగలేక మూడు రాజధానుల పేరుతో కాలయాపన చేసిన విషయం తెలిసిందే. విద్య,వైద్యం ప్రభుత్వ అధీనంలో ఉండాలని రాజ్యాంగకర్తలు ఆశించారు. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఒక చిన్నారిని ఎల్కేజీ లో చేర్చాలంటే లక్షలు ఖర్చవుతున్నాయి. జ్వరం వస్తే పరీక్షల పేరుతో వేలరూపాయలు ఖర్చవుతున్నాయి.వీటిని తట్టుకునే స్తోమత పేద,మధ్య తరగతి ప్రజలకు ఉండడంలేదు.దిగువ, మధ్యతరగతి వారికి ఉన్నత చదువులు అందని దాక్షగా మారుతున్నాయి. ప్రభుత్వ బడులు, వైద్యశాలలు నామమాత్రంగా మారుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ఇవన్నీ ప్రభుత్వ ఖర్చు ఉచితాలకే సరిపెట్టడం వల్ల జరుగుతున్నదనే విమర్శలు ఉన్నాయి.ఉచితాలు లేకపోతే రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితి ఇంతగా దిగజారదు. ఉపాధి పెంచే పథకాలు మినహా ఇతర హామీలనూ ప్రలోభాలుగా పరిగణించాలన్న డిమాండ్ జనబాహుల్యంలో వినిపిస్తోంది.