ఇదంతా రాహుల్ గాంధీ బలప్రదర్శన కోసమేనేమో?

 

లలిత్ మోడీ వ్యవహారంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుందర రాజే, వ్యాపం కుంభకోణంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజినామాలకి పట్టుబడుతూ పార్లమెంటుని స్తంభింపజేసి కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుకొనే ప్రయత్నం చేసింది. నిజానికది రాహుల్ గాంధీ చేసిన బలప్రదర్శనగానే భావించవచ్చును. ఇంతకు మునుపు అతనికి నాయకత్వ లక్షణాలు బొత్తిగా లేవు...స్వంత పార్టీని కూడా ముందుండి నడిపించలేనివాడు...ప్రధాని మోడీ ముందు ఎందుకు పనికిరాడు...వంటి అనేక విమర్శలు ఎదుర్కోవలసి వచ్చేది. ఆ విమర్శలకు ఆయన ధీటుగా జవాబు చెప్పలేక పార్లమెంటు వెనుక బెంచీలలో కునుకు తీసేవారు. కానీ రెండు నెలలు విదేశాలలో చార్జింగ్ చేసుకొని వచ్చిన తరువాత “తనొక బలమయిన నాయకుడు, పార్టీని ముందుండి నడిపించగలను మోడీని కూడా ధీటుగా ఎదుర్కోగలను...”అని నిరూపించే ప్రయత్నంలోనే కాంగ్రెస్ ఎంపీల చేత ఈ బలప్రదర్శన చేయిస్తున్నారని చెప్పవచ్చును. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ అధ్యక్షుడిగా పట్టాభిషేకం చేసుకోవడానికి పార్టీలో అంతర్గతంగా సీనియర్ల నుండి ఎదురవుతున్న అభ్యంతరాలను అధిగమించడానికి కూడా ఈ హడావుడి పనికి వస్తుందని చెప్పవచ్చును.

 

ఏమయినప్పటికీ అతను ఇప్పుడు అసలు సిసలయిన కాంగ్రెస్ నాయకుడిలాగే వ్యవహరిస్తుండటం చూసి సోనియమ్మ సైతం మురిసిపోతోంది. రెండు నెలలు విదేశాలలో తిరిగి వస్తే ఇంత మార్పు ఎలా సాధ్యమో ఆమెకీ అర్ధం కావడం లేదు కానీ ఆ వెళ్ళేదేదో పదేళ్ళ క్రితమే వెళ్లివచ్చి ఉంటే నేడు ఇటువంటి దుస్థితి వచ్చేది కాదు కదా అని మనసులో అనుకొంటూ ఉండవచ్చును.

 

కాంగ్రెస్ పార్టీ ఊహించినట్లుగానే 25మంది ఎంపీలను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సభ నుండి 5రోజుల పాటు సస్పెండ్ చేసారు. బహుశః అలాగ జరగాలనే కాంగ్రెస్ సభ్యులు సభను నడవనీయకుండా అడ్డుపడ్డారేమో? ఆ తరువాత వాళ్ళందరూ కలిసి మరో సరికొత్త ఇమ్మోషనల్ డ్రామాకు తెర తీసారు. ఎన్నడూ రోడ్డు మీద నిలబడని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పదేళ్ళ పాటు దేశాన్ని ఏలిన మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ తదితరులు అందరూ పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద నిలబడి నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. తమని సభలో నుండి సస్పెండ్ చేసినందుకే వారు ధర్నా చేస్తున్నట్లు చెప్పుకొంటున్నప్పటికీ వారి ఉద్దేశ్యం మాత్రం దేశ ప్రజల సానుభూతిని పొందేందుకేనని చెప్పవచ్చును. పార్లమెంటు సమావేశాలను సజావుగా సాగానిస్తామని హామీ ఇస్తే వారిపై నిషేధం ఎత్తివేస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు పదేపదే విజ్ఞప్తి చేసినా వారు తమ ధర్నాని అందుకే కొనసాగిస్తున్నారు.

 

కానీ వెంకయ్య నాయుడు ఆవిధంగా ప్రకటన చేయడం ద్వారా బీజేపీపై కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించినట్లయింది. పార్లమెంటును స్తంభింపజేసి మోడీ ప్రభుత్వానికి తన సత్తా చాటానని రాహుల్ గాంధీ భావిస్తుండవచ్చును. కానీ అతను ఈవిధంగా బలప్రదర్శన చేసేందుకు, ప్రజా సమస్యలపై పార్లమెంటులో చర్చ జరగకుండా అడ్డుకొన్నందుకు దేశ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని తప్పు పడుతున్నారనే సంగతి గ్రహించడం లేదు. అదే విధంగా వారిపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తామన్నా కూడా సభలోకి వెళ్ళకుండా బయట నిలబడి ఇటువంటి డ్రామాలు చేయడం వలన కూడా ప్రజల దృష్టిలో కాంగ్రెస్ పార్టీ పట్ల మరింత వ్యతిరేకత పెరుగుతోందనే సంగతి కూడా వారు గుర్తించలేకపొతున్నారు.

 

ఈ డ్రామాలు సరిపోవన్నట్లుగా ఈరోజు యువజన కాంగ్రెస్ వర్కర్ల చేత అర్ధనగ్నంగా నిరసనలు తెలియజేయించడంతో ఇంతవరకు పడిన శ్రమ అంతా వృదా అయినట్లయింది. కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ నిర్ణయాన్ని నిరసిస్తూ గాంధీ విగ్రహం వద్ద నినాదాలు చేస్తూ ధర్నా చేస్తున్నప్పుడు వారిపై సానుభూతి చూపినవారు కూడా ఇప్పుడు యువజన కాంగ్రెస్ వర్కర్లు చేసిన అర్ధ నగ్న ప్రదర్శనని చూసి కాంగ్రెస్ పార్టీని తప్పుపడుతున్నారు. ప్రజాస్వామ్యబద్దంగా నిరసనలు చేయవచ్చు కానీ ఇలాగ పార్లమెంటు ఆవరణలో ఇలాంటి వికృత చేష్టలు చేయడాన్ని అందరూ విమర్శిస్తున్నారు.

 

“ఇదేనా రాహుల్ గాంధీ తన పార్టీకి నేర్పిస్తున్న పద్దతి? ఇదేనా కాంగ్రెస్ సంస్కారం, సంస్కృతి?” అని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కాంగ్రెస్ పార్టీని కడిగిపారేశారు. కాంగ్రెస్ పార్టీ అనుకొన్నది ఒకటి జరిగినది మరొకటి. ఇదంతా నిశితంగా గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు “కాంగ్రెస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేస్తానని శపధాలు చేసిన రాహుల్ గాంధీ చివరికి తనే కాంగ్రెస్ పద్ధతులకు అలవాటు పడిపోయినట్లున్నారు”, అని అభిప్రాయపడుతున్నారు.