కాంగ్రెస్ కథ మారదా... కేడర్ కు దిక్కెవరు? 

దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సంఖ్య ముచ్చటగా మూడుకు చేరింది. రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్’ ఘడ్ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ సొంత బలంతో అధికారంలో కొనసాగుతోంది. మరో రెండు రాష్ట్రాలు, మహారాష్ట్ర, ఝార్ఖండ్’లో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీగా ఉంది. లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షం అనే ట్యాగ్ తగిలించుకోవడమే కానీ, అధికార హోదా లేదు. అంటే, అందుకు అవసరమైన (మొత్తం సభ్యుల్లో 10 శాతం) సఖ్యాబలం లేదు. ఇంచుమించుగా  రెండు సంవత్సరాలుగా అధ్యక్షుడు లేని పార్టీగా తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ సారధ్యంలో పార్టీ పడుతూ లేస్తూ తంటాలు పడుతోంది.ఇక పార్టీ భవిష్యత్ సారధి, ఆశాకిరణం అనుకున్న రాహుల్ గాంధీ కాడి తన్నేసి, బాధ్యతల నుంచి పలాయనం చిత్తగించారు. మరోవంక 23 సీనియర్ నాయకులు నాయకత్వ సమస్యను పరిష్కరించాలని కోరుతూ అధిష్టానానికి లేఖాస్త్రం సంధించారు. ఒక విధంగా నెహ్రూ గాంధీ ఫ్యామిలీ నాయకత్వంపై తిరుబాటు జెండా ఎగరేశారు. 

ఇలాంటి పార్టీని, ఇలాంటి నాయకుడిని ముందు పెట్టి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, ప్రదాని మోడీని గద్దె దించడమే లక్ష్యంగా  ‘మిషన్ 2024’  కథ నడిపిస్తున్నారు. సరే, అది ఆయనతో అవుతుందా లేదా అనేది పక్కన పెడితే, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాలలో పరిస్థితి చూస్తే, కనీసం రెండు రాష్ట్రాలలో పార్టీ, ప్రభుత్వం  సంక్షోభాన్ని ఎదుర్కుంతున్నాయి.  రాజస్థాన్’లో ముఖ్యమంత్రి అశోక్ గేహ్లోట్, మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ పీసీసీ చీఫ్ సచిన్ పైలెట్ వర్గాల మధ్య  చాలా కాలంగా సాగుతున్న ఫైట్, పతాక స్థాయికి చేరింది. సుమారు సంవత్సరం క్రితం తిరుగుబాటు జెండా ఎగరేసిన పైలట్, పదవుల పంపకం, మంత్రివర్గంలో తమ వర్గానికి స్థానం కోసం పట్టుపడుతున్నారు. అలాగే, ముఖ్యమంత్రి తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని  ఆయన వర్గం ఆరోపిస్తోంది. 

మరో వైపు  పైలట్ ఢిల్లీలో కుర్చుని చక్రం తిప్పుతున్నారు. ఉత్తర ప్రదేశ్ యువనేత  జితిన్ ప్రసాద బీజేపీలో చేరిన నేపధ్యంలో సచిన్ ఢిల్లీ యాత్ర  అనేక ఊహాగానాలకు తావిస్తోంది. ఆయన తమ వర్గానికి చెందిన 30 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు ఇటు ఢిల్లీలో అటు జైపూర్’లో ఊహాగానాలు జోరుగా షికారు చేస్తున్నాయి. మరో వంక ముఖ్యమంత్రి గేహ్లోట్, అధిష్టానం ఆదేశించినా కొవిడ్’ను అడ్డుపెట్టుకుని మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో కుదరదని కుండ బద్దలు కొట్టారు. మరోవంక ఢిల్లీలో ఉన్నా, సోనియా, రాహుల్, ప్రియాంక ముగ్గురిలో ఎవరినీ కలిసేందుకు పైలట్ నో’ అనేశారు.అయినా, అధిష్టానం ఏమీ చేయలేని, నిస్సహాయ స్థితిలో దిక్కులు చూస్తోంది. పార్టీ చరిత్రలో ఇలా పార్టీ అధిష్టానాన్ని లెక్కచేయని స్థితి ఎప్పుడూ చూడలేదని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు వాపోయారు. ఈ పరిణామాలను గమనిస్తే రాజస్తాన్’లో కూడా కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ బాటలోనే పయనిస్తోందనిపిస్తోందని అంటున్నారు.  

మరో ఏడెనిమిది నెలల్లో ఆసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్’లోనూ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్, మాజీ మంత్రి క్రికెటర్ నవజ్యోతి సింగ్ సిద్దు వర్గాల మధ్య పచ్చగడ్డి అవసరం లేకుండానే రాజకీయ సెగలు బుసలు కొడుతున్నాయి. ఈ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు పార్టీ అధిష్టానం ఏర్పాటు చేసిన  ముగ్గురు సభ్యుల బృందం, రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ జాతీయ పార్టీ అనే విషయాన్ని మరిచిపోయి, తమ సొంత పార్టీ ప్రభుత్వం నడుపుతున్నారని నివేదికలో పేర్కొంది. అంటే, అధిష్టానవర్గాన్ని లెక్క చేయని ధోరణి పంజాబ్’లోనూ కనిపిస్తోందని కమిటీ చెప్పకనే చెప్పింది. అయినా, అధిష్టానం కెప్టన్  అరేందర్ సింగ్ పై చర్యలు తీసుకునే స్థితిలో లేదు. అటూ ఇటూ అయితే, పార్టీ ప్రతిష్ట మరింత తుడిచిపెట్టుకు పోతుందని అధినాయకత్వంమే భయపడుతోంది. అందుకే  చర్యలు తీసుకునే సాహసం చ్జేయలేక పోతోంది. 
అలాగే, సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగాఉన్న మహా రాష్ట్రలో శివసేన, ఎన్సీపీ జోడీ ఒక జట్టుగా ఉన్నాయి. ఎన్నికలలో కలిసి పోటీ చేసేందుకు, అధికారాన్ని పంచుకునేందుకు సిద్దమవుతున్నాయి. కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒంటరిగా నిలబడింది. మహారాష్ట్ర  పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే ఇకపై అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని, అదే విధంగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓకే చేస్తే తానే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బరిలో దిగుతానని చెప్పు కొచ్చారు. అయితే, రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నపరిణామాలను గమనిస్తే, పటోలే భవిష్యవాణి ఎలా ఉన్నా, ప్రస్తుతం ఉన్న అధికారం కూడా చేజారిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకునేందుకు ఎన్సీపీ అధినేత్ పవార్ పావులు కడుపుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్’కు  కష్టాలు తప్పవని అంటున్నారు. 

ఇలా అధికారంలో ఉన్న రాష్ట్రాలలోనే కాంగ్రెస్ పరిస్థితి దినదిన ప్రవర్థమానంగా దిగజారుతోంది. ఇక అధికారంలో లేని రాష్ట్రాలలో పరిస్థితి గురించి అయితే వేరే చెప్పనే అక్కరలేదు. తెలంగాణలో సాగుతున్న పీసీసీ తమాషానే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఎన్నో నెలలుగా తెలంగాణ పీసీసీ వ్యవహరం, ఒకడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా  సాగుతోంది. చివరకు, మాజీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఇస్తామన్నా వద్దన్నారు... అదీ పార్టీ పరిస్థితి.