హుజురాబాద్ TRS అభ్యర్థి ఆయనేనా? ఈటలకు గండమేనా?

తెలంగాణ రాజకీయాలన్ని ప్రస్తుతం హుజురాబాద్ చుట్టే తిరుగుతున్నాయి. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజురాబాద్ అసెంబ్లీకి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఉప ఎన్నిక ద్వారా తన పవరేంటో గులాబీ బాస్ కు చూపించాలని కసితో ఉన్నారు మాజీ మంత్రి రాజేందర్. ఈటల చేరికతో జోష్ మీదున్న కమల దళం కూడా హుజురాబాద్ లో జెండా పాతి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దిశగా అడుగులు వేయాలని ప్లాన్ చేస్తోంది. అందుకే బీజేపీలో చేరిన వెంటనే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ఈటల. త్వరలో పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈటల జముల కూడా గ్రామాల్లో తిరుగుతూ అప్పుడే ప్రచారం కూడే చేసేస్తున్నారు. ఈటల రాజేందర్ కు చెక్ పెట్టాలని చూస్తున్న అధికార పార్టీ కూడా .. హుజురాబాద్ ఉప ఎన్నికపై ఫోకస్ చేసింది. మండలానికో మంత్రిని ఇంచార్జ్ గా నియమించింది. కాంగ్రెస్ కూడా ఉప ఎన్నికలో సత్తా చాటాలని భావిస్తోంది. దీంతో హుజురాబాద్ రాజకీయాలు వేడెక్కాయి. 

హుజురాబాద్‌లో రాజేందర్ కు ధీటైన అభ్యర్థి కోసం గులాబీబాస్  భారీ కసరత్తే చేస్తోందని తెలుస్తోంది. తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్న ఈటల ఓటమే లక్ష్యంగా అభ్యర్థిని పెట్టేందుకు కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారని సమాచారం. పెద్దిరెడ్డి, వకుళాభరణం కృష్ణ మోహన్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ వంటి పేర్లు పరిశీలనలోకి వచ్చాయంటున్నారు. 2018 ఎన్నికల్లో ఈటల చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి కూడా కారు పార్టీలో చేరి పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే తాజాగా కేసీఆర్ మరో అభ్యర్థి విషయంలో ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. వేములవాడ టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ(వీటీడీఏ) వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న , రిటైర్డ్ ఐఏఎస్ ముద్దసాని పురుషోత్తం రెడ్డి పేరును కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే పురుషోత్తం రెడ్డి గురించి గ్రౌండ్ లెవల్లో సమాచారం సేకరించిన ఇంటెలిజెన్స్ సీల్డ్ కవర్‌ను సీఎంకు పంపించిందని చెబుతున్నారు. 

కరీంనగర్ జిల్లాలో జనాల అభిమానం పొందిన మాజీ మంత్రి ముద్దసాది దామోదర్ రెడ్డి సోదరుడే పురుషోత్తం రెడ్డి. గతంలో కమలాపూర్ అసెంబ్లీ నుంచి నాలుగు సార్లు ప్రాతినిథ్యం వహించారు  దామోదర్ రెడ్డి. మంత్రి నియోజకవర్గం అభివృద్ధికి కష్టపడ్డారనే అభిప్రాయం జనాల్లో ఉంది. ప్రస్తుత హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న రోడ్లన్ని గతంలో ముద్దసాని మంత్రిగా ఉన్నప్పుడు వేసినవేనని చెబుతున్నారు. ముద్దసానిపై నియోజకవర్గ ప్రజల్లో మంచి పేరుందని తెలుస్తోంది. దీంతో ముద్దసారి సింపతి కలిసి వచ్చేలా.. ఆయన కుటుంబంలోని వ్యక్తిని బరిలోకి దింపాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముద్దసాని దామోదర్ రెడ్డి అన్నే పరుషోత్తం రెడ్డి కావడంతో తమకు కలసి వస్తుందనే యోచనలో టీఆర్ఎస్ లీడర్లు ఉన్నారంటున్నారు. 

పురుషోత్తం రెడ్డి గతంలో నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం వీటీడీఏ వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సీఎం కేసీఆర్.. మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా గెలిచినప్పుడు పురుషోత్తం రెడ్డి.. మహబూబ్ నగర్ కలెక్టర్‌గా పని చేశారు. దీంతో  కేసీఆర్‌కు వ్యక్తిగతంగా కూడా పురుషోత్తం రెడ్డితో మంచి సంబంధాలున్నాయి.  మొదట దామోదర్ రెడ్డి కొడుకు కశ్యప్ రెడ్డి పేరు కూడా పరిశీలనకు వచ్చిందని తెలుస్తోంది. తర్వాత కశ్యప్ పెద్ద నాన్న పురుషోత్తం రెడ్డి పేరు తెరపైకి వచ్చిందంటున్నారు. 2004లో దామోదర్ రెడ్డిని ఓడించిన రాజేందర్‌పై ముద్దసాని కుటుంబాన్ని పోటీ చేయిస్తే సానుకూల ఫలితాలు వస్తాయా లేదా అని కూడా తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారట గులాబీ బాస్. ముద్దసారి పురుషోత్తం రెడ్డి బరిలో ఉంటే మాత్రం హుజురాబాద్ లో ఈటల రాజేందర్ కు గట్టి పోటీ తప్పకపోవచ్చని అంటున్నారు. ముద్దసానిపై ఉన్న సానుభూతితో పాటు పురుషోత్తం రెడ్డి ఇమేజ్ తోడైతే.. కారు పార్టీకి కొంత లాభం జరుగుతుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వస్తోంది.