మహాకూటమి నేతల అరెస్ట్
posted on Oct 26, 2018 3:51PM

తెరాసని గద్దె దింపటమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతృత్వంలో టీడీపీ,సీపీఐ,టీజేఎస్ మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే.తాజాగా బీజేపీ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా సీబీఐ కార్యాలయాల వద్ద నిరసన చెప్పట్టాలని పిలుపునిచ్చారు.రాహుల్ పిలుపు మేరకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయం ముందు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాల్లో కాంగ్రెస్‌కు మద్దతుగా తెదేపా, సీసీఐ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. సీబీఐ ప్రతిష్ఠ దెబ్బతీశారంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేతలు నినాదాలు చేశారు. సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్. రమణ, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ కుంతియా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీబీఐ కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు మహాకూటమి నేతలను అదుపులోకి తీసుకున్నారు.
అదేవిధంగా విజయవాడలో కూడా కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. మహాత్మాగాంధీ రోడ్డులోని ఆదాయపన్ను శాఖ కార్యాలయంలోకి ప్రదర్శనగా వెళ్తున్న పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, తదితరులను పోలీసులు ఆంధ్ర రత్న భవనం వద్దే నిలువరించారు. నిరసనకు అనుమతి లేదంటూ వారిని ముందుకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర రత్న భవన్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రఘువీరారెడ్డితో సహా పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి భవానీపురం పోలీసుస్టేషన్‌కు తరలించారు.
.JPG)