కమలంలో కల్లోలం.. ఆ ముగ్గురిపై ధిక్కార స్వరం..
posted on Oct 13, 2021 11:48AM
ఏపీ బీజేపీ. ఎదుగూబొదుగూ లేని పార్టీ. ఉనికి కోసం ఆరాటం. క్లారిటీ లేని పోరాటం. ఎవరికి వారే రాజకీయం. అందుకే, కమలం పూరేకులు వాడిపోతున్నా.. నీళ్లు పోసే నాయకుడే లేడు. గతంలో టీడీపీతో పొత్తు ఉన్నప్పుడు మాత్రమే ఆ పార్టీకి కాస్తోకూస్తో గుర్తింపు, గౌరవం ఉండేది. పసుపు పార్టీతో తెగదెంపులు చేసుకున్నాక కాషాయ రంగు వెలవెలపోతోంది. పవన్‌కల్యాణ్‌తో చేతులు కలిపినా.. బీజేపీలో ఏమాత్రం జోష్ రావడం లేదు. ఏపీలో ఆలయాలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నా.. ఉత్తుత్తి పోరాటలే తప్ప హిందుత్వాన్ని, పార్టీని పటిష్టపరిచే ప్రణాళికా బద్దమైన కార్యచరణ లేదు. జగన్‌తో, వైసీపీతో కుమ్మక్కు కావడం.. అధికార పార్టీకి లోపాయికారిగా సహకరించడం వల్లే బీజేపీకి ఏపీలో సరైన గుర్తింపు రావడం లేదని చెబుతున్నారు. ఏపీలో బీజేపీ పతనావస్థకు కారణం ఆ ముగ్గురే అంటున్నారు.
సునీల్ దియోథర్, సోము వీర్రాజు, విష్ణువర్థన్‌రెడ్డి.. ఈ ముగ్గురు నాయకులు బీజేపీని భ్రష్టు పట్టిస్తున్నారని పార్టీ శ్రేణులే భగ్గుమంటున్నాయి. సోము వీర్రాజు, విష్ణువర్థన్‌రెడ్డిలు పక్కా జగన్ మనుషులేనని ఏపీలో ఎవరిని అడిగినా చెబుతారు. వీర్రాజు, విష్ణులు.. ప్రభుత్వం మీదకంటే.. ప్రతిపక్ష టీడీపీ మీదే ఎక్కువగా దాడి చేస్తుంటారు. ఇక విష్ణువర్థన్'రెడ్డి' అయితే మీడియా మైకుల ముందు టీడీపీని విమర్శించడమే ఆయన పని. అమరావతిపై సైతం నోటికొచ్చినట్టు మాట్లాడితే.. ఓ టీవీ డిమేట్‌లో జేఏసీ నాయకుడి చేతిలో చెప్పు దెబ్బ కూడా తినాల్సి వచ్చింది. వీర్రాజు, విష్ణుల ప్రజావ్యతిరేఖ చర్యల వల్లే ఏపీలో బీజేపీకి ప్రజాధారణ లేకుండా పోతోందని అంటున్నారు. ఇక ఏపీ బీజేపీ ఇంఛార్జి సునీల్ దియోథర్ సైతం వారికి వంతపాడుతూ.. పార్టీని సర్వనాశనం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జీవీఎల్ సైతం వీరి కోటరీకి చెందిన మనిషే.
సునీల్, వీర్రాజు, విష్ణు.. వీళ్లు పని చేయరు.. చేసే వాళ్లను చేయనీయరు. మిగతా పార్టీ శ్రేణులందరినీ అణగదొక్కేసి ఈ ముగ్గురు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పలువురు బలమైన నాయకులు బీజేపీలో చేరినా.. టీడీపీ నుంచి వచ్చారనే ఏకైక కారణంతో వారిని పక్కన పెట్టేస్తున్నారు. తమకు ఎక్కడ పోటీగా వస్తారోనని.. తమ ఆధిపత్యానికి ఎక్కడ గండి పడుతుందేమోననే.. అభద్రతా భావంతోనే సునీల్-వీర్రాజు-విష్ణు టీమ్ ఇలా చేస్తున్నారనే ఆరోపణ ఉంది.
టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టిజి వెంకటేష్‌లు అత్యంత బలమైన నాయకులు. కానీ, ఈ ముగ్గురూ బీజేపీలో అంత యాక్టివ్‌గా లేకపోవడానికి కారణం వారిని అణిచేసే ప్రయత్నమేనంటున్నారు. ఇటీవల ఏపీ బీజేపీ ఇంఛార్జ్ సునీల్ దియోథర్ చేసిన కాంట్రవర్సీ కామెంట్లు పార్టీలో కాకరేపుతున్నాయి. టీడీపీ నుంచి వచ్చిన వారికి బీజేపీ పార్కింగ్ జోన్‌గా మారనిచ్చేది లేదంటూ ఇటీవల పార్టీ సమావేశంలో సునీల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. విజయవాడలో సుజనా చౌదరికి చెందిన పంక్షన్‌హాల్‌ను ‘పార్కింగ్ జోన్’గా వాడుకుంటూ, తిరిగి ఆయనతో పాటు టీడీపీ నుంచి వచ్చిన వారిని పార్కింగ్‌జోన్‌గా వ్యాఖ్యానించడం ఏంటని పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
సునీల్-వీర్రాజు-విష్ణుల పెత్తనానికి వ్యతిరేకంగా పలువురు సీనియర్లు, కొత్త-పాత నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా దృష్టికి విషయం తీసుకెళ్లారని.. అమిత్‌షానూ కలిసి ఫిర్యాదు చేసేందుకు అపాయింట్‌మెంట్ అడిగారని తెలుస్తోంది. ఈ ముగ్గురూ ఇలా పార్టీకి నష్టం చేకూర్చేలా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నా.. ఏపీ వ్యవహారాలు చూసే జాతీయ స్థాయి నాయకులైన జీవీఎల్ కానీ, మురళీధర్ కానీ.. అసలేమాత్రం పట్టించుకోకపోవడాన్ని తప్పుబడుతున్నాయి పార్టీ వర్గాలు. ఇటీవల బీజేపీ జాతీయ కార్యవర్గం ప్రకటించినా.. అందులో ఏపీ నుంచి కన్నా మినహా మరెవరికీ స్థానం దక్కకపోవడానికి వీరు చేసిన లాబీయింగే కారణమంటున్నారు. ఆ ముగ్గురి ఒంటెద్దు పోకడలతో ఇప్పటికే జనసేన-పవన్‌కల్యాణ్ బీజేపీకి దూరమయ్యే పరిస్థితి దాపురించింది. బద్వేల్‌లో తలోదారి చూసుకున్నారు. ఏపీలో పార్టీకి ఎదుగుదల లేకుండా పోయింది. ఈ దుస్థితికి కారణమైన సునీల్ దియోథర్‌ను వెంటనే ఏపీ నుంచి తప్పించాలని హైకమాండ్‌కి ఫిర్యాదు వెళ్లింది. వీలైతే వీర్రాజు-విష్ణుల ప్రాథాన్యత కూడా తగ్గించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.