ముఖ్యమంత్రులే దోషులుగా నిలిస్తే!

మన దేశంలో ఏ రాష్ట్రానికైనా పెద్దదిక్కుగా భావించేది అక్కడి ముఖ్యమంత్రినే. కానీ ఇప్పుడు ఆ ముఖ్యమంత్రులే పలు ఆరోపణల్లో కూరుకుపోతున్నారు. ఈశాన్యంలో అరుణాచల్‌ ప్రదేశ్‌, మధ్య భారతంలోని ఉత్తర్‌ప్రదేశ్‌, దక్షిణాదిన కేరళ ముఖ్యమంత్రులు తమ ప్రభుత్వాలనే ప్రశ్నార్థకం చేసే స్థితిలో ఉన్నారు. ఒకే సమయంలో మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు సందిగ్ధంలో పడిపోవడం ఒక అనూహ్యమైన పరిణామం…

మన దేశ సరిహద్దుల్లో ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ రక్షణపరంగా చాలా కీలకమైన రాష్ట్రం. ఆ ప్రదేశాన్ని ఎప్పుడెప్పుడు కబ్జా చేద్దామా అని చైనా కాచుకుని కూర్చుని ఉంది. అలాంటి అరుణాచల్ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి ‘నబామ్ టుకి’ రాష్ట్రంలోని శాంతిభద్రతలను కాపాడలేకపోతున్నారంటూ గవర్నర్‌ రాజ్‌కొవా కేంద్రానికి నివేదికలను అందించారు. గవర్నరు నివేదికను కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించడంతో ఇప్పడు అక్కడ గవర్నరు పాలన మొదలైంది. గవర్నరు పక్షపాతంతో వ్యవహరించారన్న ప్రతిపక్షాల విమర్శలో నిజం లేకపోలేదు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి నబామ్‌ తన సహచరులను అదుపు చేయడంలో కానీ, శాసనసభలో సరిగా నిర్వహించడంలో కానీ పూర్తిగా విఫలమయ్యారన్నది మాత్రం స్పష్టంగా కనిపించే వాస్తవం. పైగా నబామ్‌ కొన్ని తీవ్రవాద సంస్థలతో సంబంధం కలిగి ఉన్నారనీ, మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిచారనీ ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇక కేరళ ముఖ్యమంత్రి పదవి కూడా ఇప్పుడో అప్పుడో అన్నట్లు మారిపోయింది. ‘సోలార్‌ స్కామ్’లో పీకలోతు మునిగిపోయిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ నిజంగానే దోషి అనేందుకు రోజుకో కొత్త సాక్ష్యం బయటకి వస్తోంది. సౌర విద్యుత్తు పేరుతో సరిత నాయర్‌ అనే వ్యక్తి కొన్ని కోట్ల రూపాయలను ప్రజల నుంచి దండుకున్నారన్నది ఈ కుంభకోణం. ఇందులో ఉమెన్‌ చాందీకి కూడా వాటాలు అందాయన్న ఆరోపణలు గట్టిగా వినిపించాయి. దాంతో న్యాయవిచారణని ఎదుర్కొన్న తొలి కేరళ ముఖ్యమంత్రిగా ఆయన రికార్డుని స్థాపించారు. సరిత నేరుగా ముఖ్యమంత్రితో సంభాషించేదనీ, ఆయన మంత్రివర్గ సహచరులతో కూడా ఆమెకు సంబంధాలు ఉన్నాయని ఆమె ఫోన్‌ రికార్డులు స్పష్టం చేయడంతో తాను నిర్దోషినని గట్టిగా చెప్పేందుకు ఉమెన్‌ చాందీకి కూడా ధైర్యం చాలడం లేదు. డబ్బు, అక్రమ సంబంధాలు, అధికార దుర్వినియోగం, హత్యలు… ఇలా ఒక బ్లాక్‌బస్టర్ సినిమా తీసేందుకు తగినంత ముడిసరుకంతా ఈ సోలార్‌ స్కాంలో బయటపడుతోంది. కాకపోతే దురదృష్టమల్లా కథానాయకులుగా ప్రజలను కాపాడాల్సినవారు కాస్తా దోషులుగా నిలవడమే!

ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ది మరో వింత కథ. తండ్రి నుంచి వారసత్వంగా ముఖ్యమంత్రి పీఠాన్ని సైతం దక్కించుకున్నారు కానీ, ఆది నుంచి అంతం దాకా అన్నీ హంసపాదులే ఎదురవుతున్నాయి. సాక్షాత్తూ హైకార్టు న్యాయమూర్తి మాటలని సైతం కాదని తనకి సన్నిహితుడైన వ్యక్తికి అఖిలేష్‌ ‘లోకాయుక్త’ పీఠాన్ని కట్టబెట్టారు. అవినీతిని అడ్డకట్టవేసే లోకాయుక్తగా తన మనసునెరిగిన వాడు ఉంటే, పెద్దగా ఇబ్బందులు ఉండవన్నది అఖిలేష్‌ అభిమతం కావచ్చు. సుప్రీం కోర్టు కనుక అడ్డుపడకపోతే ఆయన పంతం నెరవేరి ఉండేదేమో! కానీ దేశంలోని అత్యున్నత న్యాయస్థానం అఖిలేష్‌ నియమించిన లోకాయుక్తని తప్పించి ఆ స్థానంలో ఒక సమర్థవంతమైన వ్యక్తిని నియమించింది. న్యాయస్థానాల నుంచి అఖిలేష్‌కు అక్షింతలు కొత్త కాదు కానీ, ఈ లోకాయుక్త వ్యవహారం మాత్రం ఆయన మెడకి చుట్టుకునేట్లే కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఆయన ప్రభుత్వం కూలిపోకున్నా అఖిలేష్‌ రాజకీయ జీవితంలో ఇదొక మచ్చగా మాత్రం మిగిలిపోనుంది.

ఈ వారం వార్తల్లో నిలిచిన ముగ్గురు ముఖ్యమంత్రుల కథ ఇది. అలాగని మిగతావారు ఏమంత సమర్థంగా పాలిస్తున్నారని కాదు. అలాంటి భ్రమలు కూడా ప్రజలకు లేవు. కానీ ఒకో రాష్ట్రం పై జాబితాలో చేరుతూ పోతుంటే దేశం ఏమైపోతుందన్నదే ఇప్పటి ప్రశ్న!