అందుకే..(నా) గజ్వేల్‌కు కేసీఆర్ గుడ్ బై?

తెలంగాణ ముఖ్యమంత్రి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సిట్టింగ్ స్థానం గజ్వేల్ నుంచి పోటీ చేయరట. నియోజకవర్గ సమీక్షలో పార్టీ నాయకుడు, ప్రజా ప్రతినిధులకు ఈ విషయంలో ఆయనే స్వయంగా సంకేతాలు ఇచ్చారట. అంతే కాకుండా.. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓ రోల్ మోడల్ గా తాను తీర్చిదిద్దిన గజ్వేల్ నియోజకవర్గంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డిని బరిలో దింపుతున్నట్లు కూడా హింట్ ఇచ్చారట. అయితే.. మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా? లేక మరేదైనా కొత్త వ్యూహం పన్నారా? అనేది మాత్రం ఎవరికీ అంతుచిక్కని ఫజిల్ గా మారింది. ఇదే విషయం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అయితే.. రాజకీయ ఎత్తులు వేయడంలో దిట్ట అనిపించుకున్న కేసీఆర్ మరేదో కొత్త వ్యూహం రచించి ఉంటారని, అందులో భాగంగానే తన సిట్టింగ్ గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయకూడదని నిర్ణయించుకుని ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ బీజేపీపైన, మోదీపైన సందర్భం వచ్చినప్పుడల్లా నిరసన గళం వినిపిస్తూనే ఉన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీపై ఒక విధంగా ఆయన వార్ ప్రకటించారనే చెప్పాలి. కేసీఆర్ మొన్నా మధ్యన తమిళనాడు వెళ్లి, ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ తో చర్చలు జరిపారు. ఆ చర్చల సారాంశం ఏమిటో బయటపెట్టకుండా గుంభనంగా ఉంచారు. ఆ తర్వాత బీహార్ ప్రతిపక్షనేత తేజస్వి యాదవ్, ఆ పార్టీలోని మరి కొందరు సీనియర్ నేతలను ప్రగతి భవన్ కు రప్పించుకుని చర్చలు జరిపారు. వారి కోసం కేసీఆర్ ప్రత్యేకంగా బీహార్ కు చార్టర్డ్ ఫ్లైట్ పంపించారని మీడియా అంతా కోడై కూసింది. అంతకు ముందు కేరళ సీఎం, ఇతర సీపీఎం జాతీయ స్థాయి నేతలతో కూడా ప్రగతిభవన్ లో సమాలోచనలు చేశారు.

అదలా ఉంచితే.. కేసీఆర్ కన్ను ఇప్పుడు కేంద్రంపై పడిందని, బీజేపీ ముక్త భారత్ దిశగా ఆయన పావులు కదుపుతున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ వంకతో కేంద్రం చక్రం తిప్పడమో లేక, ప్రధాన పదవి పైదవి పైనో కేసీఆర్ కన్నేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో పాటు తన కుమారుడు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ అధికార సింహాసనంపై కూర్చోబెట్టాలనే లక్ష్యం ఎన్నాళ్లుగానో కేసీఆర్ లో ఉంది. తాను ఢిల్లీపై గురిపెడితే.. కొడుకు తెలంగాణను ఏలుకోవాలనేది కేసీఆర్ వ్యూహం కావచ్చనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.

ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ లో నిర్వహించి సమీక్షలో వంటేరు ప్రతాపరెడ్డిని గెలిపించాలని ఇటీవలే ఎన్నికైన ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డికి సూచించారు. అయితే.. తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది మాత్రం ఏమాత్రం లీకవకుండా చతురుడైన చంద్రశేఖరరావు జాగ్రత్త పడ్డారు. ఇదే ఇప్పుడు కేసీఆర్ వ్యూహం ఏమిటనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చకు తావిస్తోంది. నిజానికి వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి తాను పోటీ చేయడం లేదని కేసీఆర్ చెప్పినప్పుడే స్థానిక నేతలు ఒక్కసారిగా అవాక్కయ్యారని తెలుస్తోంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ.. గతంలో వైసీపీలో ఉన్నప్పుడు వంటేరు ప్రతాపరెడ్డి కేసీఆర్ పైన, గులాబీ పార్టీపైన ఒంటికాలిపై లేచి మరీ విమర్శలు చేసిన వైనాన్ని స్థానిక నేతలు లోపల్లోపలే గుర్తుచేసుకుని మదనపడుతున్నారట. అయితే.. గులాబీ బాస్ కు ఇప్పుడు అత్యంత సన్నిహితుడిగా వంటేరు ప్రతాపరెడ్డి ఉండడంతో కేసీఆర్ ముందు నోరు విప్పితే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అనే భయంతో వారు అన్నీ మూసుకుని గుంభనంగా ఉంటున్నారట. గజ్వేల్ నియోజకవర్గం నుంచి వంటేరును బరిలో దింపుతున్నట్లు కేసీఆర్ అభిప్రాయం చెప్పడంతోనే స్థానిక టీఆర్ఎస్ లో అప్పుడే లొల్లి మొదలైందంటున్నారు. ఇటీవలే టీఆర్ఎస్ లో చేరిన వంటేరుకు ఛాన్స్ ఎలా ఇస్తారనేది ఉద్యమకారులం అని చెప్పుకునే పార్టీ సీనియర్ల నుంచి తన్నుకు వస్తున్న ప్రశ్న. కేసీఆర్ ఓ ప్రతిపాదన తెచ్చినంత మాత్రాన అన్నీ అయిపోతాయా? వంటేరుకు ఛాన్స్ రాకుండా అడ్డుకునేందుకు ఆయన వ్యతిరేక వర్గం ఇప్పటికే రంగంలోకి దిగిందని అంటున్నారు.