వామ్మో.. ఇంకో వైరస్, నిజమా వ్యూ..హమా?

చైనాలోని వ్యూహాన్’లో కరోనాగా పుట్టి ప్రపంచం మొత్తాన్ని చుట్టేసిన కొవిడ్ 19 మహమ్మారి  ఇంకా చావ లేదు. కొత్త కొత్త వేరియంట్లుగా పుట్టుకొస్తూనే వుంది. డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లుగా చైనా మహమ్మారి కరాళ నృత్యం ప్రపంచం అంతటా కొనసాగుతూనే వుంది. ఒక్క మన దేశంలోనే నాలుగు లక్షల 93 వేల 218 మంది కొవిడ్ కారణంగా కన్ను మూశారు. ప్రస్తుతం  కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేవ్ కొనసాగుతోంది. ఒక విధంగా ప్రపంచం భయం గుప్పిట్లో బతుకుతోంది.

ఇదలా ఉంటే, చైనా ఇప్పుడు ఇంకొక భయంకర హెచ్చరిక చేసింది. దక్షిణాఫ్రికాలోని గబ్బిలాల్లో ప్రమాదకర నియో కోవ్‌ (NeoCoV) వైరస్‌‌ను గుర్తించినట్టు వుహాన్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. కొత్తరకం కరోనా వైరస్ ‘నియోకొవ్’తో పెను ప్రమాదం పొంచి ఉందని, అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరస్‌తో మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని వుహాన్ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. కొవిడ్‌-19తో పోలిస్తే ‘నియో కోవ్‌’భిన్నమైనదే గాక, ప్రమాదకరమైనదని కూడా చెప్పారు. యాంటీబాడీలు, కొవిడ్‌- 19 వ్యాక్సిన్లు కూడా దీనికి పనిచేయకపోవచ్చని అంటున్నారు.

2012, 2015లో పశ్చిమాసియా దేశాల్లో విజృంభించిన మెర్స్‌- కోవ్‌ మాదిరిగా ‘నియో కోవ్‌’తో అధిక మరణాలు ఉండొచ్చని వ్యూహాన్ శాస్త్ర వేత్తలు హెచ్చరించారు. ఈ వైరస్‌ మనుషులకు వ్యాపిస్తే.. సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరికి ప్రాణాపాయం తప్పదని అంటున్నారు. ఇక సార్స్‌ కోవ్- 2 మాదిరిగా వేగంగా మనుషులకు సోకే ప్రమాదం ఉందన్నారు.
ఈ ప్రకటన పూర్వాపరాలు ఎలా ఉన్నా, ఈ ప్రకటనతో ప్రపంచ వ్యాప్తంగా మరోమారు తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మాత్రం  చైనా శాస్త్రవేత్తలు గుర్తించిన ఈ కొత్తరకం కరోనా వైరస్‌పై మరింత అధ్యయనం అవసరం అని తెలిపింది. గబ్బిలాల్లో ‘నియో కోవ్‌’ ఉన్నట్టు వుహాన్ పరిశోధకులు గుర్తించిన విషయం తమకు తెలిసిందని, అయితే, ఈ వైరస్‌ వల్ల మనుషులకు ముప్పు ఉంటుందా? లేదా అనే విషయం తెలుసుకోడానికి మరింత అధ్యయనం అవసరమని డబ్ల్యూహెచ్‌వో పేర్కొన్నట్టు రష్యా న్యూస్‌ ఏజెన్సీ టాస్‌ వెల్లడించింది. మరోవంక కొందరు నిపుణులు కరోనా/ కొవిడ్ సృష్టి వెనక డ్రగ్స్ మాఫియా హస్తముందని, ఆ కుట్రను చ్చేదించకుండా మహమ్మారికి ముగింపు పలక లేమని అంటున్నారు.