ఎమ్మెల్యేలతో రెగ్యులర్ టచ్‌లో చంద్రబాబు... భయపడొద్దంటూ భరోసా

టీడీపీ అధినేత చంద్రబాబు తన ఎమ్మెల్యేలతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నారు. వీలు కుదిరినప్పుడల్లా ఫోన్లో మాట్లాడుతూ యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలతో వైసీపీ మైండ్ గేమ్ ఆడుతుండటంతో అప్రమత్తమైన చంద్రబాబు... తన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ గురిపెట్టిన ఎమ్మెల్యేలు... ఊగిసలాటలో ఉన్న నేతలతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతున్న చంద్రబాబు... తొందరపడి ఎలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని చెబుతున్నారు. వైసీపీ కావాలనే మైండ్ గేమ్ ఆడుతోందని, ఆర్ధిక మూలాలపై గురిపెట్టి ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటోందని, అయినాసరే ఎవరూ భయపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పిస్తున్నారు.

ఇక, ఎప్పట్నుంచో పార్టీ మారతారని ప్రచారం జరుగుతోన్న విశాఖ సిటీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కూడా చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. మొదట్లో గంటా వైసీపీలోకి వెళ్తారని... ఆ తర్వాత బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే, ఎప్పట్నుంచో తెలుగుదేశం కార్యక్రమాలకు దూరంగా ఉంటోన్న గంటా... ప్రస్తుతం ఏ పార్టీలోనూ చేరకుండా స్తబ్ధుగా ఉండటంతో... బాబు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఏదైనా సమస్య ఉంటే తనను కలిసి మాట్లాడాలని, ఎలాంటి ఇబ్బంది ఉన్నా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే, టీడీపీ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవానికి రావాలని చంద్రబాబు ఆహ్వానించడంతో... తప్పనిసరిగా వస్తానంటూ గంటా చెప్పినట్లు తెలుస్తోంది.

అలాగే, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పై కూడా వైసీపీ నుంచి ఒత్తిడి వస్తున్నట్లు తెలియడంతో మాట్లాడేందుకు చంద్రబాబు ప్రయత్నించినట్లు తెలిసింది. అయితే, అనగాని ఫోన్లో అందుబాటులోకి రాలేదని చెబుతున్నారు. ఇక, గొట్టిపాటి రవికుమార్ పైనా అలాంటి ఒత్తిడే ఉన్నా... ఇప్పటికిప్పుడు పార్టీ మారే ఆలోచన లేదని ఆయన సన్నిహితులు అంటున్నారు. చంద్రబాబుతో కూడా ఆయా ఎమ్మెల్యేలు తమకు పార్టీ మారే ఆలోచన లేదని చెప్పినట్లు తెలుస్తోంది.