టీ సర్కార్‌కి ముందుచూపు లేదు... చంద్రబాబు

 

తమ ప్రభుత్వం ముందు చూపుతో విద్యుత్ కొనుగోలు చేసిందని, విద్యుత్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందుచూపుతో ఆలోచించలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తన అసమర్థతను ఇతరుల మీద రుద్దాలని ప్రయత్నిస్తోందని, ఇది సమంజసం కాదని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన నియమ నిబంధనలను కూలంకషంగా వివరించారు. జులైలో జరిగిన సమావేశంలో ఈ నిబంధనలన్నిటికీ ఒప్పుకున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు నిబంధనలను ఉల్లంఘించి విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని చెప్పారు. ఇలా నీటిమట్టం లేకపోయినా విద్యుత్ ఉత్పత్తి చేస్తే భవిష్యత్తులో తాగునీటి సమస్య వస్తుందని వివరించారు. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్న విద్యుత్ ప్రాజెక్టుల ఉత్పత్తి నుంచి 54 శాతం విద్యుత్ తెలంగాణకు ఇస్తామని, అయితే భవిష్యత్తులో కట్టబోయే ప్రాజెక్టుల నుంచి కూడా విద్యుత్ కావాలని అడగటం సమంజసం కాదని, తాము అలా ఇవ్వబోమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణ ఇబ్బందులు తెలిసే 300 మెగావాట్ల విద్యుత్ ఇస్తామని చెప్పామని ఆయన తెలిపారు.