పేద ప్రజల దైవం ఎన్టీఆర్: చంద్రబాబు

 

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్‌కి ఎన్టీఆర్ పేరును మార్చాలని తెలంగాణ శాసనసభలో చేసిన తీర్మానానికి నిరసన తెలియజేస్తూ తెలుగుదేశం సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఒకరోజు నిరసన దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. తెలుగుదేశం అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకి వచ్చి నర్సింహులుకు తన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘శంషాబాద్ విమానాశ్రయం తెలుగుదేశం పార్టీ కారణంగానే వచ్చింది. దేశీయ టెర్మినల్‌కి ఎన్టీఆర్ పేరు పెట్టింది మేమే. ఆరోజు రాజీవ్ గాంధీ పేరు మార్చే అవకాశం వున్నా మార్చలేదు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ పేరు పెడతామని 2009లోనే చెప్పాం. అప్పుడు టీఆర్ఎస్ నేతలు ఎందుకు వ్యతిరేకించలేదు? ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎన్టీఆర్ పేరుమీద మాట్లాడుతున్నారు. సోనియాగాంధీ ఎక్కడివారు? పేదల ఆరాధ్య దైవమైన ఎన్టీఆర్ ఏదో ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదనే విషయాన్ని అందరూ గ్రహించాలి. పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దుచేసి తెలంగాణ ప్రాంతానికి నిజమైన స్వాతంత్ర్యం తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌దే. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న నాయకులు ఎన్టీఆర్ వల్ల పైకి వచ్చినవారు కాదా? ఎన్నో అద్భుతమైన పథకాలను ఎన్టీఆర్ ప్రవేశపెట్టారు. భౌగోళికంగా విడిపోయినా తెలుగువారంతా కలిసి వుండాలి. తెలంగాణను అభివృద్ధి చేయబోయేది కూడా తెలుగుదేశం పార్టీనే’’ అన్నారు.