పోలవరం వల్ల తెలంగాణకు ఇబ్బంది లేదు.. వెంకయ్య..

 

పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఒక్కశాతం కూడా నష్టం లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. విజయవాడలోని గేట్‌వే హోటల్లో పోలవరం ప్రాజెక్టు పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, వృధాగా పోతున్న జలాలను నదుల అనుసంధానం ద్వారా వినియోగించుకోవాలని అన్నారు. వరద జలాలను దారి మళ్ళిస్తే 16 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం వుందని చెప్పారు. గోదావరి జలాల్లో 80 టీఎంసీల నీటిని కృష్ణానదికి మళ్ళించవచ్చని తెలిపారు. వరద జలాలను మళ్ళించగలిగితే 45 టీఎంసీల నీటిని రాయలసీమకు ఇవ్వొచ్చని వెంకయ్య చెప్పారు. పదిమందికి ఉపయోగపడే కార్యక్రమం వల్ల ఒకరిద్దరికి కష్టం వస్తుందని, వారి బాగోగులు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద వుందని వెంకయ్య అన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల 154 శాతం రెవిన్యూ గ్రామాలు, 9 మండలాడు ముంపుకి గురవుతాయని, విశాల ప్రయోజనాల దృష్ట్యా కొంతమందికి ఇబ్బంది తప్పదని అన్నారు. పోలవరం ప్రాజెక్టులు బహుళార్థ సాధక ప్రాజెక్టుగా వెంకయ్య నాయుడు అభివర్ణించారు.