కాళేశ్వరంపై కేంద్రం ఆరోపణాస్త్రాలు దేనికి సంకేతం

తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్ఘాత్మకంగా, రాష్ట్రానికే తలమానికంగా అభివర్ణించిన వాయు వేగంతో పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పుడు వివాదాల ముసురు కమ్ముకుంటోంది. ఇటీవలి భారీ వరదల్లో ఆ ప్రాజెక్టు పంప్ హౌజ్ లు మునిగిపోవడమే ఇందుకు కారణంగా చెప్పాలి.

అయితే కనీవినీ ఎరుగని రీతిలో సంభవించిన భారీ వరదల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని తెరాస సర్కార్ చెబుతున్నప్పటికీ విపక్షాల నుంచి మాత్రం కమిషన్ల కక్కూర్తి కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎంగా మారిందని అంటున్నారు.  డిజైన్ మార్పు పేరుతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని విపరీతంగా పెంచేసి అంతులేని అవినీతికి పాల్పడడం వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు ఈ దుస్థితికి చేరుకుందని కాంగ్రెస్, బీజేపీలు విమర్శిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వెల్లువెత్తిన విమర్శలన్నీ ఒకెత్తు.. తాజాగా కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ విమర్శలు మరో ఎత్తు అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

జలశక్తి మంత్రి షెకావత్ కాళేశ్వరం ప్రాజెక్టును దండుగమారి ప్రాజెక్టుగా అభివర్ణించడం, భారీ ఎత్తున అవినీతి జరిగిందనీ, నిర్మాణం నాసిరకంగా ఉందనీ అందుకే ఒక్క వరదకే దాని పని ఎత్తిపోయిందని షెకావత్ విమర్శించారు. స్వయంగా కేంద్ర జలశక్తి మంత్రే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నాసిరకమని, భారీ ఎత్తున అవినీతి జరిగిందనీ ఆరోపించడంతో.. ఇక ఈ ప్రాజెక్టుపై కేంద్రం విచారణకు ఉపక్రమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. టీఆర్ఎస్, మంత్రి హరీష్ రావు ఎంత తీవ్రంగా షెకావత్ ఆరోపణలను ఖండించినా.. షెకావత్ విమర్శల సీరియస్ నెస్ ఇసుమంతైనా తగ్గలేదు.

చాలా కాలంగా కేసీఆర్ కుటుంబ అవినీతిపై ఆరోపణలకు గుప్పిస్తూ.. ఆయన జైలుకు వెళ్లడం ఖాయమంటూ చెబుతూ వస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన ఆరోపణలకు ఇప్పుడు మరింత పదును పెట్టే అవకాశం ఉంది. అలాగే టీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు, అప్పులు ఇచ్చిన కేంద్రం ఇప్పుడు రాజకీయ కారణాలతో విమర్శల బురద జల్లుతోందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఇప్పుడు బురద జల్లుతున్న కేంద్రమే.. గతంలో పలు సందర్భాలలో కాళేశ్వరం ప్రాజెక్టును పొగడ్తలతో ముంచెత్తిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కాళేశ్వరం అవినీతిపై షెకావత్ విమర్శల తరువాత ఈ విషయంలో కేంద్రం వెనక్కు తగ్గే అవకాశాలు ఇంకెంత మాత్రమూ లేవని అంటున్నారు.

తన ఆరోపణలను జస్టిఫై చేసుకోవడానికైనా కాళేశ్వరంపై దర్యాప్తునకు కేంద్రం ఆదేశించక తప్పని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలు, నాసిరకం నిర్మాణం కారణంగా ప్రాజెక్టుకు వాటిల్లిన నష్టం, నిరర్ధక వ్యయం తదితర అంశాలపై కేంద్రం త్వరలోనే ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.అలాగే ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతి ఆరోపణలకు జస్టిఫికేషన్ కోసం ఈడీ దాడులు జరిగే అవకాశాలను కూడా కొట్టి పారేయలేమని అంటున్నారు.