కొలికపూడిపై వేటు తప్పదా? చంద్రబాబు సంకేతం అదేనా?

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై వేటు తప్పదా? ఆయన పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారా? అంటే తాజాగా ఆయన తిరువూరు ఎమ్మెల్యే ఎదురుపడినా పట్టించుకోకపోవడాన్ని బట్టి చూస్తే అవుననే అనాల్పి వస్తున్నది. తిరువూరు నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించిన కొలికపూడి శ్రీనివాసరావు, ఆ తరువాత నిత్యం వివాదాల్లో ఉంటూ పార్టీకి తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొలికపూడి తెలుగుదేశంకు మద్దతుగా తన విశ్లేషణలు, పంచ్ డైలాగులతో టీవీ డిబేట్లలో చురుకుగా ఉంటూ అందరి దృష్టినీ ఆకర్షించారు.

ఆ క్రమంలోనే చంద్రబాబు దృష్టిలో పడ్డారు. తిరువూరు నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా టికెట్ దక్కించుకుని పోటీ చేసి గెలిచారు. అయితే ఎమ్మెల్యేగా ఆయన వ్యవహారశైలి అత్యంత వివాదాస్పదంగా మారింది. ఆయన మాటలు, చేతలూ పార్టీకి ఇబ్బందిగా మారాయి. తాజాగా రాజీనామా చేస్తానంటూ 48 గంటల అల్టిమేటమ్ ఇచ్చి కొలికపూడి పార్టీ అధినేత ఆగ్రహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే శనివారం నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలో పర్యటించిన చంద్రబాబు తనకు ఎదురుపడిన కొలికపూడిని కనీసం పట్టించుకోలేదు. ఆయన అభివాదం చేసినా స్పందించలేదు.  కనీసం పలకరించలేదు. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన పార్టీ నేతలందరితో కరచాలనం చేసి నవ్వుతూ ఆప్యాయంగా పలకరించిన చంద్రబాబు కొలికపూడి వద్దకు వచ్చే సరికి కరచాలనం చేయలేదు సరికదా? కనీసం పలకరించడానికి కూడా ఇష్టపడలేదు. 

తిరువూరు ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో కొలికపూడి వ్యవహారశైలిపై పార్టీ అగ్రనాయకత్వం ఆగ్రహంగా ఉందన్న సంగతి ఇప్పటికే తెలిసిందే అయినా.. తాజాగా  చంద్రబాబు కొలికపూడిని గుర్తించడానికి కూడా ఇష్టపడకపోవడం చూస్తుంటే ఆయనపై వేటు తప్పదన్న విషయం అర్థమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

 వాస్తవానికి వైసీపీ హయాంలో అమరావతి రైతుల ఉద్యమానికి కొలికపూడి గట్టి మద్దతుదారుగా ఉన్నారు. వందల డిబేట్లలో పాల్గొన్నారు. ముఖ్యంగా మీడియా డిబేట్లలో ఆయన వాగ్దాటి, ఆయన రాజకీయ పరిజ్ణానం, ఆయన విశ్లేషణా తీరుఆయను పార్టీ అధినాయకత్వంలో మంచి గుర్తింపు తీసుకువచ్చింది. తిరువూరు నుంచి తెలుగుదేశం తరఫున పోటీ చేసే అవకాశం దక్కేలా చేసింది. ఆయన విజయం సాధించారు. అయితే ఎమ్మెల్యేగా ఆయన పనితీరు, వ్యవహారశైలి వివాదాస్పదంగా మారడంతో పార్టీ అగ్రనాయకత్వం ఆయనను మూడు సార్లు పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించుకుని మరీ చీవాట్లు పెట్టింది.  అయినా కొలికపూడి తీరు మారలేదు.    తాజాగా తిరువూరు  తెలుగుదేశం నాయకుడు, మాజీ ఏంఎంసీ ఛైర్మన్‌ రమేష్‌ రెడ్డి ఓ గిరిజన మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసిన కొలికిపూడి తన డిమాండ్ మేరకు ఆయనను సస్పెండ్ చేయకుంటే 48 గంటల్లో తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అల్టిమేటమ్ జారీ చేశారు. దీనిపై పార్టీ అధిష్ఠానం త్రిసభ్య కమిటీ వేసింది. తిరువూరు ఎమ్మెల్యే తీరుపై నివేదిక ఇవ్వాలని ఆ కమిటీని నిర్దేశించింది. ఈ నేపథ్యంలోనే నందిగామ పర్యటనలో  కొలికపూడి శ్రీనివాసరావును చంద్రబాబు పట్టించుకోలేదు.  ఇలా పట్టించుకోకపోవడం ద్వారా  కొలికిపూడిపై వేటు తప్పదని చంద్ర బాబు పరోక్షంగా హెచ్చరించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.