చంద్రబాబు మారారు.. ఇవిగో ఆధారాలు
posted on Sep 10, 2024 6:34AM
వైసీపీ హయాంలో జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనతో టీడీపీ శ్రేణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కొందరు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు అక్రమ కేసులతో జైళ్లకు పోయారు.. మరి కొందరు వైసీపీ మూకల దాడుల్లో గాయపడ్డారు. అలాగే జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తిన ప్రజలు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో పలు సందర్భాల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జగన్ మోహన్ రెడ్డికి తీవ్ర హెచ్చరికలు చేశారు. తెలుగుదేశం శ్రేణులపై దాడులకు పాల్పడిన వైసీపీ నేతలను, అధికారులను వదిలిపెట్టేది లేదని గట్టిగా చెప్పారు. అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త చంద్రబాబును చూస్తారని.. ఈసారి జగన్, వైసీపీ బ్యాచ్ ను వదిలేది లేదని అప్పట్లో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. సరే ఎన్నికలు జరిగాయి. జగన్ ఐదేళ్ల పాలనపై విసిగిపోయిన ప్రజలు టీడీపీ కూటమి ప్రభుత్వానికి భారీ మెజార్టీతో పట్టం కట్టారు. సీఎంగా నాలుగవ సారి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబులో ఊహించని మార్పులు ఉంటాయని, అధికారంలో ఉన్న సమయంలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు జైళ్లకు వెళ్లడం ఖాయమని అందరూ భావించారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో అప్పులమయంగా మారిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అధికార పగ్గాలు చేపట్టి మూడు నెలలవుతున్నా వైసీపీ హయాంలో రెచ్చిపోయిన ఆ పార్టీ నేతలపై చర్యలపై చంద్రబాబు ఏ మాత్రం దృష్టి పెట్టలేదని, చంద్రబాబులో ఎలాంటి మార్పురాలేదని కొందరు తెలుగుదేశం నేతలు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, నిజంగా చెప్పాలంటే చంద్రబాబు మారిపోయారు. ఆ విషయం కొందరు తెలుగుదేశం నాయకులకు, వైసీపీ హయాంలో వేధింపులకు గురైన క్యాడర్ కు అర్థం కాలేదు కానీ, జగన్ మోహన్ రెడ్డికి మాత్రం స్పష్టంగా అర్థమైంది. కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఏపీ రాజకీయాలపై అవగాహన ఉన్న అందరికీ కూడా చంద్రబాబులో వచ్చిన మార్పు అవగతమౌతుంది.
చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి జగన్ అరాచకపాలన కారణంగా అధ్వానంగా మారిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించడంతోపాటు.. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా దృష్టిసారించారు. ఇదే సమయంలో వైసీపీ హయాంలో తెలుగుదేశం, జనసేన శ్రేణులను, ప్రజలు ఇబ్బందులు పెట్టిన ఆ పార్టీ నేతలు, అధికారులపైనా కొరడా ఝుళిపిస్తున్నారు. పైకి ఇవన్నీ కనిపించకపోయినా.. చంద్రబాబు వ్యూహాత్మంగా వేస్తున్న అడుగులు జగన్ మోహన్ రెడ్డిలో ఆందోళన పెంచుతున్నాయి. అందుకే ఎక్కువగా బెంగళూరులో ఉండేందుకే జగన్ మెగ్గుచూపుతున్నారు. అధికారం కోల్పోయిన తరువాత తాడేపల్లి ప్యాలెస్ లో కంటే జగన్ ఎక్కువగా బెంగళూరులోనే ఉన్నారు. ఏదైనా శవ రాజకీయాలు చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఏపీకి వచ్చి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. రెండు మూడు రోజులు ఏపీలో ఉండి మళ్లీ బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లిపోతున్నారు. విజయవాడను వరదలు ముంచెత్తిన సమయంలోనూ జగన్ బెంగళూరులోనే ఉన్నాడు. అక్కడి నుంచి వచ్చి రెండు దఫాలుగా ముంపు ప్రాంతాల్లో పర్యటించి చంద్రబాబుపై విమర్శలు చేసి వెళ్లిపోయారు. ఏపీలో ఉంటే ఏ క్షణమైనా పోలీసులు తనను అరెస్టు చేయవచ్చునన్న భయం జగన్ మోహన్ రెడ్డిని వెంటాడుతుందన్న టాక్ వైసీపీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
ఇవన్నీ తెలియని తెలుగుదేశం శ్రేణులు చంద్రబాబు మారలేదు అనుకుంటున్నారు కానీ, చంద్రబాబులో వచ్చిన మార్పు ప్రజల కంటే జగన్ మోహన్ రెడ్డికే బాగా అర్థమైంది. కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు జగన్, వైసీపీ గ్యాంగ్ చేస్తున్న ప్రతీ కుట్రను చంద్రబాబు సమర్ధవంతంగా తిప్పికొడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్ల పంపిణీపై జగన్ మోహన్ రెడ్డి టార్గెట్ చేశారు. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు.. చంద్రబాబు పెన్షన్లు ఇవ్వలేరని తద్వారా ప్రజలను కూటమి ప్రభుత్వంపై రెచ్చగొట్టవచ్చునని అనుకున్నారు. కానీ, చంద్రబాబు తన పాలనా అనుభవంతో ప్రతీ నెలా ఠంచనుగా ఒకటవ తేదీనే అర్హులైన ప్రతీ ఒక్కరికి పెన్షన్లు అందిస్తుండటంతో జగన్ కుట్రలకు చెక్ పడింది.
ఆ తరువాత తల్లికి వందనం ఏమైంది అంటూ వైసీపీ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలు పెట్టారు. ప్రత్యేక హోదాను హైలెట్ చేయాలని చూశారు, బడ్జెట్ లో టార్గెట్ చేయాలని చూశారు. ఎమ్మెల్యే వీడియో వ్యవహారం రచ్చ చేయాలని పెద్ద ప్లాన్ చేశారు. గుడ్లవల్లేరు కాలేజి వ్యవహారంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. ప్రతీ అంశంలోనూ జగన్ కుట్రలను చంద్రబాబు బలంగా తిప్పికొడుతున్నారు. చివరికి వరద విషయంలోనూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా జగన్ ప్రయత్నాలు చేశారు. బాధితులతో మాట్లాడితే వాళ్ళు చంద్రబాబుని తిడతారని చూశాడు.. కానీ, 74ఏళ్ల వయస్సులోనూ రాత్రి పగలు అనే తేడా లేకుండా చంద్రబాబు నాయుడు వరద నీటిలో పర్యటిస్తూ బాధితులకు అండగా నిలిచాడు.వారిలో భరోసా నింపారు. ధైర్చం చెప్పారు. ప్రతీఒ క్కరికి ఆహారం అందించి వరద బాధితుల నుంచి కూడా చంద్రబాబు ప్రశంసలు పొందాడు. దీంతో జగన్ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి చంద్రబాబుపై విమర్శలు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ఇలాలాభం లేదని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు.. అమరావతి మునిగిపోయిందని.. ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ప్రభుత్వం ఎలాంటి సహాయం అందించడం లేదని తప్పుడు ప్రచారం చేశారు. ప్రజలే స్వయంగా రంగంలోకి దిగి వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టారు.
వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలను ఆదుకునేందుకు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో చంద్రబాబు విఫలమయ్యారని ప్రచారం చేసేందుకు వైసీపీ నేతలు వేసిన ప్లాన్ కూడా బెడిసి కొట్టింది. ఎవరూ ఊహించని విధంగా కేంద్రం ఏపీలో వచ్చిన వరదలపై రెస్పాండ్ అయింది. అయినా, వైసీపీ నేతలకు బుద్ది రాలేదు. మాజీ మంత్రులు రోజా, అంబటి రాంబాబును రంగంలోకి దింపి వరదలకు చంద్రబాబే కారణం అంటూ విమర్శలు చేయించారు జగన్.. కానీ, అవి రివర్స్ అయ్యి జగన్ మోహన్ రెడ్డికే చుట్టుకున్నాయి. గత ఐదేళ్ల కాలంలో బుడమేరు మరమ్మతులను పట్టించుకోకపోవటం వల్లనే ప్రస్తుతం వరదలకు కాణమని ప్రజలకు నిర్ధారణకు వచ్చేశారు. ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉధృతి పెరగడంతో బ్యారేజ్ గేట్లను పడగేట్టేలా జగన్ అండ్‌కో ప్లాన్ చేసింది. మూడు ఇనుప బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజ్ ను ఢీకొనడంతో బ్యారేజ్ గేటు భాగంలో స్వల్పంగా డ్యామేజ్ అయింది. అసలు బోట్లు ఎలా వచ్చాయనే విషయంపై ఆరా తీయగా.. అందతా వైసీపీ నేతల కుట్రలో భాగమేనని తేలింది. మరోపక్క టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్, అప్పిరెడ్డిలను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేయగా.. కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చిపెట్టేలా జగన్, వైసీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలను చంద్రబాబు నాయుడు సమర్ధవంతంగా తిప్పికొడుతున్నాడు. మరో వైపు వైసీపీ హయాంలో అవినీతి అక్రమాలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించి అక్రమార్కులపై కొరడా ఝుళిపిస్తోంది. దీంతో ఏపీలో ఉంటే ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చు అనే భయం జగన్ ను వెంటాడుతుంది. అందుకే జగన్ బెంగళూరుకు మకాం మార్చేశారు. ఏపీకి వచ్చినా పట్టుమని వారం రోజులుకూడా ఉండటం లేదు. బాబులో వచ్చిన మార్పు జగన్ లో పెంచిన ఆందోళనే అందుకు కారణం. తనలా అడ్డగోలుగా అరెస్టులూ నిర్బంధాలతో కూటమి ప్రభుత్వం రెచ్చిపోతే సానుభూతి పొందే అవకాశం ఉంటుందని భావించిన జగన్ కు చంద్రబాబు పకడ్బందీగా అన్ని ఆధారాలతో తన హయాంలో జరిగిన అక్రమాలు, దౌర్జన్యాలు, దాడులు, భూదందాలను వెలికి తీస్తుండటంతో జగన్ వణికిపోతున్నారు. బాబులో వచ్చిన ఈ మార్పు ముందుముందు వైసీపీలోని అక్రమార్కుల భరతం పట్టడం ఖాయమని పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు.