కేసీఆర్ కు చంద్రబాబు మరో రిటర్న్ గిఫ్ట్.. బీఆర్ఎస్ పనైపోయినట్లేనా?

తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేసీఆర్ విషయంలో టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారా? 2019లో  తెలుగుదేశం పార్టీ ఓటమిపై కేసీఆర్ చేసిన రిటర్న్ గిఫ్ట్ వ్యాఖ్యలకు చంద్రబాబు ఇప్పుడు అదే రీతిలో బదులు చెప్పడానికి రెడీ అయిపోయారా? ప్రత్యర్థులకు అందని వ్యూహాలతో చెలరేగిపోతారన్న పేరున్న కేసీఆర్ చంద్రబాబు ఎత్తులతో చతికిలపడిపోయారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీని పోటీకి దూరంగా ఉంచడమే ప్రధాన కారణమని అంటున్నారు. సరే అది పక్కన పెడితే.. ఆంధ్రప్రదేశ్ లో చారిత్రాత్మక విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలంగాణలో బలోపేతంపై దృష్టి సారించింది. చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావడంపై నజర్ పెట్టారు.  

కారణాలేమైతేనేం.. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం నేతలు చాలా వరకూ తమ దారి తాము చూసుకున్నారు. పార్టీని వీడారు. అయితే పార్టీ క్యాడర్ మాత్రం చెక్కుచెదరలేదు. ఆ విషయం విభజన తరువాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ ప్రస్ఫుటంగా అవగతమైంది.  తెలంగాణలో  ఏ ఎన్నిక జరిగినా...  పార్టీలన్నీ తెలుగుదేశం క్యాడర్ మద్దతు కోసం ప్రాకులాడాయి, ప్రయత్నించాయి.  ఆ పార్టీ క్యాడర్  మద్దతు పొందిన పార్టీనే విజయం వరిస్తుందన్న నమ్మకమే ఇందుకు కారణం.   అది కేవలం నమ్మకం కాదు.. నూటిని నూరుపాళ్లూ వాస్తవం అన్న సంగతి  2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో సందేహాలకు అతీతంగా రుజువైంది. 

ఎవరు ఔనన్నా కాదన్నా  తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి నేతలు లేరు కానీ కార్యకర్తలు మాత్రం పార్టీ పట్ల విశ్వాసంతో, అంకిత భావంతో పని చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నారు.. ఉంటారు. రాష్ట్ర విభజన అనంతర రాజకీయ పరిణామాల కారణంగా రాష్ట్రంలో తెలుగుదేశం యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ  ఆ పార్టీ పునాదులు రాష్ట్రంలో  ఇసుమంతైనా చెక్కు చెదరలేదు. పార్టీ అధినేత చంద్రబాబు ఒక్క పిలుపు ఇస్తే చాలు ఇక్కడ  జెండా ఎగురవేయడానికి క్యాడర్ సిద్ధంగా ఉంది.  ఈ విషయం గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అన్ని పార్టీలూ తెలుగుదేశం జెండా పట్టడంతో మరోసారి రుజువైంది. 

ఇక ఇప్పుడు రాష్ట్రంలో పార్టీపై చంద్రబాబు దృష్టి పెట్టడం అంటే బీఆర్ఎస్ ఉనికి మాత్రంగా కూడా మిగిలే అవకాలు అంతంత మాత్రంగానే ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా తాను ఎంత బిజీగా ఉన్నా తెలంగాణలో పార్టీ కోసం సమయం కేటాయిస్తానని విస్పష్టంగా ప్రకటించిన చంద్రబాబు. తెలంగాణలో స్థానిక ఎన్నికలలో  తెలుగుదేశం పోటీ చేస్తుందని ప్రకటించారు. దీంతో ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న బీఆర్ఎస్ బేజారైపోయింది. హైడ్రా, రుణమాఫీ, రైతు బంధు వంటి విషయాల్లో రేవంత్ సర్కార్ తీరును ప్రశ్నిస్తూ ఇప్పుడిప్పుడే ప్రజలలోకి వస్తున్న బీఆర్ఎస్ నేతలు తెలుగుదేశం ఎంట్రీతో జావగారిపోతున్నారు.  ఎందుకంటే తెలంగాణలో  తెలుగుదేశం కోసం అంకిత భావంతో పని చేసే కార్యకర్తలు ఉన్నారు.  ఈ పదేళ్ల కాలంలో వారంతా ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తూ వచ్చారు. ఆ మద్దతు 2023 ఎన్నికలలో  లభించకపోవడంతోనే బీఆర్ఎస్ పరాజయం పాలయ్యింది. 

ఇప్పుడు మళ్లీ తెలంగాణ తెలుగుదేశం దగ్గరకు వస్తే.. పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయి. వాటిని చెక్కు చెదరకుండా కాపాడుతున్న క్యాడర్ ఉంది. మరి రాష్ట్రంలో పార్టీని ముందుండి నడిపించే నాయకుడు ఎవరు అంటే మాత్రం సమాధానం దొరకదు.  అందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా.. ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ.. తరచుగా హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్ భవన్ లో క్యాడర్ కు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నారు. అదే విధంగా  రాష్ట్రంలో పార్టీకి సమర్ధుడైన అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఒక సారి చంద్రబాబు తెలంగాణలో పార్టీపై దృష్టి పెట్టాననీ, పూర్వ వైభవం దిశగా పార్టీని నడిపిస్తాననీ ప్రకటించగానే.. ఇంత కాలం అక్కడా ఇక్కడా సర్దుకుని పబ్బం గడిపేస్తున్న మాజీలంతా తెలుగుదేశం వైపు చూస్తున్నారు. ఆ సంగతి అలా ఉంచితే.. ఇంత కాలం పార్టీలో ఉంటూ కూడా ఏ మాత్రం క్రియాశీలంగా లేని నేతలు అలర్ట్ అయిపోయారు. పార్టీని అంటిపెట్టుకుని ఉన్నామని చెప్పుకుంటూ పార్టీ పదవుల కోసం రేసులోకి వచ్చేస్తున్నారు.  ఈ పదేళ్లలో పట్టుమని పది సార్లు కూడా ఎన్టీఆర్ భవన్ లో అడుగుపెట్టని నేతలు సైతం తామే పార్టీకి ఇంత కాలం పెద్దదిక్కుగా ఉన్నామని చెప్పుకోవడానికి పోటీలు పడుతున్నారు.  ఇలా పార్టీ పదవి కోసం అర్రులు చాస్తున్న వారిలో కార్యకర్తలలో పలుకుబడి ఉన్నవారెవరు అంటే  ఎవరూ కనిపించని పరిస్థితి ఉంది. రాష్ట్రంలో పదేళ్లుగా పార్టీకి పెద్దదిక్కుగా ఉన్నామంటూ చెప్పుకుంటూ చొక్కాలు చించేసుకుంటున్న వారెవరికీ పార్టీ క్యాడర్ లో ఇసుమంతైనా పలుకుబడి లేదు.   తెలంగాణలో తెలుగుదేశం ఉంది. చాలా  బలంగా ఉంది. అయితే ఆ పార్టీకి రాష్ట్రఅధ్యక్ష పదవి మాత్రం ఖాళీగా ఉంది.  గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆ పదవి ఖాళీ అయ్యింది. అప్పట్లో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న  కాసాని జ్ణానేశ్వర్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడన్న వాడే లేకుండా పోయారు.  తెలంగాణలో ఎన్నికల బరి నుంచి తెలుగుదేశం తప్పుకోవడంతో అప్పట్లో పార్టీ అధ్యక్ష పదవిని భర్తీ చేయడానికి చంద్రబాబు ఏం తొందరపడలేదు.

అయితే ఇప్పుడు స్థానిక ఎన్నికలలో పార్టీ పోటీలో ఉంటుందని స్వయంగా చంద్రబాబే ప్రకటించారు. దీంతో ఇక పార్టీ అధ్యక్షుడి ఎన్నిక లేదా ఎంపిక సత్వరమే జరగడం ఖాయం.   ఇప్పుడిక రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో చంద్రబాబు ఉన్నారన్నది స్పష్టం కావడంతో రాష్ట్ర విభజన తరువాత   పార్టీని వీడి ఇతర పార్టీలలో చేరి అక్కడ ఇమడలేక ఉక్కపోతకు గురి అవుతున్న పలువురు తెలుగుదేశం మాజీ నాయకులు హోం కమింగ్ అంటూ తెలుగుదేశం గూటికి చేరడానికి క్యూకడుతున్నారు. దీంతో బీఆర్ఎస్ కంగారు పడుతోంది. కంగాళీ అవుతోంది. రాష్ట్రంలో తెలుగుదేశం బలపడితే.. తమ రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరమేనని బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు గురౌతున్నారు. సరిగ్గా స్థానిక ఎన్నికల ముందు రాష్ట్రంలో పార్టీ పటిష్ఠతమై చంద్రబాబు దృష్టి సారించడం అంటే కేసీఆర్ కు రెండో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.