ఏపీకి వెళ్ళండి.. ఐఏఎస్‌లపై ‘క్యాట్’ గర్జన!
posted on Oct 15, 2024 5:48PM
ఆంధ్రా కేడర్ ఐఏఎస్‌లు తెగేదాకా లాగారు.. చివరికి తెగిపోయింది. వెళ్ళమన్న రాష్ట్రానికి గౌరవంగా వెళ్తే బాగుండేది... ఇప్పుడు సుద్దులు చెప్పించుకుని మరీ వెళ్ళాల్సి వస్తోంది. తమను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళాలని ఈనెల 9న కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డీఓపీటీ ఆదేశించిందని, ఆ ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, కాటా ఆమ్రపాలి, ఎ.వాణీప్రసాద్, రొనాల్డ్ రాస్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)ని ఆశ్రయించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావలసి వున్న జి.సృజన తనను ఆంధ్రలోనే వుంచాలని కోరుతూ క్యాట్‌ని ఆశ్రయించారు. అయితే వీరందరూ ప్రభుత్వం చెప్పినట్టు చేయాల్సిందేనని క్యాట్ స్పష్టం చేసింది. వీళ్ళ పిటిషన్‌ని విచారణ జరుపుతున్న సమయంలో క్యాట్ కీలకమైన వ్యాఖ్యలు చేసింది. "ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు వర్షాలు, వరదలతో ఇబ్బంది పడుతున్నారు. అక్కడకి వెళ్ళి, వారికి సేవ చేయాలని మీకు లేదా? ఐఏఎస్‌ల కేడర్ కేటాయింపుల విషయంలో డీఓపీటీకి పూర్తి అధికారాలు ఉన్నాయి’’ అని క్యాట్ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న వాకాటి కరుణ, కాటా ఆమ్రపాలి, వాణీప్రసాద్, రోనాల్డ్ రాస్ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కి వెళ్లాల్సివుంది. ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్న సృజన తెలంగాణకు రావాల్సి వుంటుంది. ఐఏఎస్‌లు, డీఓపీటీ వాదనల తర్వాత డీవోపీటీ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ‘క్యాట్’ నిరాకరించింది. ఎవరికి కేటాయించిన రాష్ట్రానికి వాళ్ళు వెళ్లాల్సిందేనని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.