శరీరం బరువు గురించి యోగా ఏమి చెబుతోంది?
posted on Jan 13, 2023 9:39AM
శరీరం బరువు నిరంతరం అడుక్కి త్రొక్కేస్తూ వుంటుంది. అంత శరీర భారాన్ని చిన్న పాదాలు రెండు మొయ్యవలసివస్తోంది. కనుక నిట్టనిటారుగా నిలబడితే సరిగా నిలబడలేక తూలిపోయే పరిస్థితి వస్తుంది. మరి ఎలా నిలబడాలి?? కాలి పిక్కల్లోని కండరాలు, తొడల మీద కండరాలు మనిషి పై భాగపు బరువును మోయాలి. అలా కాకుండా కేవలం పాదాల మీద బరువు మోస్తే.. పిరుదులో, మోకాళ్ళో, కాలికండలో సడలిపోయి తుళ్లి పడిపోతాము.
మనిషి శరీరంలో బరువు మొయ్యలేక పాదాలు వీగిపోతున్నప్పుడు శరీరంలో ఉన్న పిక్కలు, నడుము భాగంలో కండరాలు బిగిసిపోయి, ఎలాగో మిమ్మల్ని నిలబెట్టాలని ప్రయత్నిస్తాయి అప్పుడే మనిషి శరీరం ఊగిపోతుంది. అలా కాకుండా శరీరాన్ని ముందుగానే నడుము, పిక్కలు కండరాల సహాయంతో బ్యాలెన్స్ చేయడం అలవాటైతే ఇలాంటి సమస్యే ఉండదు.
మనం సాధారణంగా వెల్లకిలా నేలమీద పడుకున్నాము అనుకోండి! అప్పుడు బరువంతా వీపు మీదనే మోపుకుంటారు కానీ పిక్కల మీద కాదు కదా.. కాబట్టి ఆ స్థితిలో కండరాలు సాగవలసిన అవసరం లేదు. అందుకే పిక్కలకు బయటవున్న కండరాలైనా, తొడలకు ముందున్న కండరాలైనా, పొట్టకండరాలైనా, వీపు కండరాలైనా వాటిని గురుత్వ వ్యతిరేక కండరాలని అంటున్నారు. మనిషి శరీరం మొత్తంలో ఉన్న కండరాలన్నిటిలోనూ బిగువును ఎక్కువగా కలిగి ఉన్న కండరాలివే.
ఈ కండరాలు సహజంగా ఎక్కువగా శరీరంలో పనిచేస్తూ ఉంటాయి. ఈ కండరాలు గంట గంటకి గురుత్వాన్ని ఎదుర్కోవటం అందరికీ కష్టంగానే ఉంటుంది. నిలబడ్డప్పుడు అయితే ఇక చెప్పనవసరం లేదు.. మనిషిలో ఛాతీలోని కండరాలు, మెడకి ఇటూ అటూ ఉన్న కండరాలూ ఎక్కువ వాడుతూ ఉంటాం. అందుకని అవి బాగా మెత్తబడి పోతూంటాయి. గురుత్వ వ్యతిరేక కండరాలు పుష్టిగా ఉంటేటట్లు అందరూ జాగ్రత్త పడాలి. అప్పుడే అవి గుండెకు బాగా తోడ్పడగలుగుతాయి. నిలబడ్డప్పుడు గురుత్వం కాళ్ళల్లోకి, పాదాలలోకి ప్రసరిస్తుంది. అప్పుడే గుండె నుంచి రక్తం ఎక్కువగా తోడుతుంది. ఆ రక్తం పాదాలు, కాళ్ళ నుంచి వెనుదిరిగి గుండె, ఊపిరితిత్తులు చేరేటప్పుడు గురుత్వమే నిరోధిస్తుంది.
అప్పుడు గురుత్వ వ్యతిరేక కండరాలు బిగుసుకొని గురుత్వం వల్ల గుండెల్లోంచి రక్తాన్ని పూర్తిగా కాళ్ళల్లోకి దిగిపోకుండా నిరోధించి, అక్కడున్న రక్తం ఊపిరితిత్తుల్లోకి, గుండెల్లోకి ప్రవహించేలా చూస్తాయి. కదలకుండా చాలాసేపు నిలబడి నట్లయితే కాళ్ళల్లో కండరాలు సూక్ష్మరక్తనాళాలను పిండివేసి, కొయ్యబారిపోతాయి. రక్తాన్ని తిరిగి ఊపిరితిత్తుల్లోకి, గుండెల్లోకి చేరకుండా నిరోధించాయన్నమాట! అప్పుడు గుండె ఓవర్ గా పని చేయవలసి వస్తుంది. అదే సమయంలో కాళ్ళు పీక్కు పోతాయి. నానా బాధా పడిపోతారు.
అందుకే అడుగు మీద అడుగు వేసుకొంటూ ఎంతదూరం నడిచినా కలగని బాధ కొద్దిసేపు నిశ్చలంగా నిలబడటం వల్ల కలుగుతుందన్న మాట!
అలాంటప్పుడు ప్రతిరోజూ ఎన్నిగంటలు నిశ్చలంగా మనం నిలబడుతున్నామో ఆలోచించుకోవాలి. వృధాగా అలా నిలబడటం వల్ల దేనిని కోల్పోతున్నామో గ్రహించాలి. పర్యవసానంగా శరీర సౌష్టవం, దానితో బాటు శరీరం దాని కంఫర్ట్ తొలగిపోతున్నాయి! మనిషిలో చెలరేగే నీరసం, నిస్త్రాణాలు ఈసురోమని అనిపించేటట్లు చేస్తాయి. ఇలాంటి అనుభూతి కలిగినంత సేపు మనిషి తనను తాను ఎప్పుడూ ఉత్తేజవంతుడిగా ఉంచుకోలేడు. ఈ విషయం తెలుసుకున్నవాడు ఉత్తముడు అనుకోవచ్చు.
◆నిశ్శబ్ద.