కొండని తవ్వి ఎలుకని పట్టారు!

 

 

 

రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర మంత్రుల బృందం చేసిన నిర్వాకమంతా కొండని తవ్వి ఎలుకని పట్టినట్టుంది. రాష్ట్ర విభజన మీద మూడు నెలలపాటు రకరకాల కసరత్తులు చేసి సాధించిందేంటయ్యా అంటే గుండు సున్నా! రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న రోజున ఏదయితే ప్రకటించిందో అదే నిర్ణయం అమలు చేయనున్నట్టు కేంద్ర మంత్రుల బృందం తన నివేదిక ద్వారా చెప్పకనే చెప్పింది. శంఖంలో పోస్తేనే తీర్థమవుతుందన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ తాను అనుకున్నది, ఆలోచించినదంతా మంత్రుల బృందం ద్వారా అధికారికంగా తెలుగు ప్రజల మీద రుద్దుతోంది.


కాంగ్రెస్ పార్టీకి అధికారిక కలరింగ్ ఇవ్వడానికే మంత్రుల బృందం రకరకాల సమావేశాలు, అభిప్రాయ సేకరణలు, ప్రశ్నపత్రాలు, లీకులు... ఇలా నానా హడావిడి చేసిందన్న విషయం ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. తెలుగోళ్ళని ఏ రకంగా పిచ్చోళ్ళని చేయొచ్చో  ఆ రకంగా చేసిపారేసింది. చర్చలూ అవీ ఇవీ అని తెలుగు ప్రజల్ని తన చుట్టూ తిప్పుకుంది. భవిష్యత్తులో రాజనీతి శాస్త్రం సబ్జెక్టులో ‘జనాన్ని పిచ్చోళ్ళని చేసి ఆడించుట ఎలా?’ అనే లెసన్ కనుక ప్రవేశపెడితే కేంద్ర మంత్రుల బృందం వ్యవహారశైలిని అందులో తప్పకుండా పెట్టాలి. అపార అనుభవజ్ఞులు, రాజకీయరంగంలో ఉద్ధండ పిండాల్లాంటి వాళ్లు ఈ మంత్రుల బృందంలో వున్నారు కదా..  ఒకదాంట్లో కాకపోయినా ఒకదాంట్లో అయినా రెండు ప్రాంతాల ప్రజలకు ఆమోద యోగ్యంగావుండే అంశాలను పొందుపరుస్తారులే అనే నమ్మకం కొందరిలో వుండేది.



ఇప్పుడు తెలంగాణ వైపు ఏకపక్షంగా రూపొందించిన నివేదిక ఆ నమ్మకాన్ని కూడా వమ్ము చేసేసింది. రాష్ట్ర విభజన విషయంలో నిరంకుశంగా, నిర్దయగా, పూర్తి స్వార్థపూరితంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్న కాంగ్రెస్ పార్టీ, పైపైకి సంప్రదింపులు, చర్చలనే చక్కర రాసిన విష గుళికని తెలుగు ప్రజల చేత మింగించే ప్రయత్నం చేసింది. తెలుగువారిని విజయవంతంగా మోసం చేసింది. ఏ ఒక్క విషయంలో కూడా సీమాంధ్రుల సమస్యలను పట్టించుకోని కేంద్ర మంత్రుల బృందాన్ని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ప్రస్తుతం సీమాంధ్ర ప్రజలున్నారు.