ఇది మనిషి వికృత చేష్టలకు పరాకాష్ట 

కేరళలోని మలప్పురం జిల్లా లో గర్భం తో ఉన్న ఏనుగు కు మందుగుండు కూరిన పైన్ ఆపిల్ ను ఆహారంగా అందించి దాని ప్రాణాలు తీసిన ఘటన పై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనకు బాధ్యులైన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ముక్త కంఠం తో కోరుతున్నారు. తాజాగా దీని పై కాంగ్రెస్ సీనియర్ నేత సినీ నటి విజయ శాంతి స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. మూగ జీవాల విషయం లో కొందరు వ్యక్తుల మానవత్వం మరిచి ప్రవర్తిస్తున్న తీరు ను ఆమె తప్పు పడుతూ పేస్ బుక్ ద్వారా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

 
ఈ సృష్టిలో ఎంతో గొప్ప జీవి మనిషేనని గర్వంగా చెబుతారు. కానీ, దేవుడికి తన సృష్టిపై తనకే అసహ్యం వేసేలా ప్రవర్తిస్తున్నారు మనుషులు. ఈ ప్రకృతిపై మనిషికి మాత్రమే ఆధిపత్యం ఉన్నట్టు.... మిగిలిన జీవాల మనుగడ ఈ మనుషుల దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడి ఉన్నట్టు... కొందరు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే కడుపు రగిలిపోతోంది. కేరళలో గర్భంతో ఉన్న ఒక ఏనుగుకు బాణాసంచా మందు కూరిన అనాసపండు పెట్టి, ఆ మూగజీవి మరణవేదనను క్రూరంగా వినోదించిన ఈ మనుషుల వికృత చేష్టలకు ఏ శిక్ష వేస్తే సరిపోతుంది? ఈ సంఘటనకు ముందు టిక్‌టాక్ వీడియో కోసం ఒక కుక్కపిల్ల కాళ్ళూ చేతులు కట్టేసి మురికి కాలువలోకి విసిరేసి ప్రాణాలు తీసిన ఘోరాన్ని చూశాం. అంతకు ముందు ఒక వ్యక్తి మేడపై నుంచి కుక్కను దారుణంగా విసిరేశాడు. మూగజీవాలపై ఇలా ఎన్నెన్నో అకృత్యాలు... అసలేం జరుగుతోంది? ఇతర జీవులకు భూమ్మీద బతికే హక్కు లేదా? నేడు మన ప్రపంచం అనుభవిస్తున్న ఈ రోగాలు... దిగజారిన పరిస్థితులు... చూస్తుంటే మనిషి చేసే తప్పులకు ఆ ప్రకృతి విధిస్తున్న శిక్షలే ఇవని అనిపిస్తోంది. తప్పు చేసినవారే కాదు... చూస్తూ స్పందించనివారు... అడ్డుకునే శక్తి ఉన్నప్పటికీ ఆ పని చెయ్యనివారు కూడా శిక్షార్హులే. అందుకే ఇకనైనా మారదాం... నిండైన మానవత్వమున్న మనుషులుగా బతుకుదాం. ఆ పరమేశ్వరుని దృష్టిలో మనం కృతఘ్నులం కావద్దు’’ అంటూ విజయశాంతి తన ఆవేదన వ్యక్తం చేశారు.