సొరకాయ వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు ఉంటాయని మీకు తెలుసా?

 

భారతీయ వంటలలో సొరకాయది చాలా  ప్రత్యేక స్థానం.  ఎక్కువ మందికి వండాలంటే గుమ్మడి,  సొరకాయ,  క్యాబేజీ వంటి బరువైన కూరగాయలను వంటకు వినియోగిస్తుంటారు.  చాలామంది సొరకాయను ఇంటికి తెచ్చుకుని వండుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ ఖద్దూ కా ఖీర్,  హల్వా.. అంటే సొరకాయ పాయసం,  సొరకాయ హల్వా.. వంటివి మాత్రం చాలా ఫేమస్ కూడా అయ్యాయి.  సొరకాయ అంటే ఇష్టపడని వారు కూడా సొరకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇకమీదట తినడానికి ఆసక్తి చూపిస్తారు.  అసలు సోరకాయలో పోషకాలు ఏంటి? సొరకాయ తినడం వల్ల కలిగే లాభాలు ఏంటి తెలుసుకుంటే..

సొరకాయలో కేలరీలు తక్కువగా,  ఫైబర్,  అవసరమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి,  రక్తంలో చక్కెర నియంత్రణకు మద్దతు ఇస్తుంది. అయితే సొరకాయ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ,  దీనిని అందరూ తినే అవకాశం లేదని కూడా అంటున్నారు ఆహార వైద్యులు. సొరకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు,  నష్టాలు రెండింటిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది..

సొరకాయ 90 శాతం కంటే ఎక్కువ నీరు కలిగి ఉంటుంది.  ఇది  హైడ్రేషన్‌ను నిర్వహించడానికి ఒక మంచి ఎంపిక . ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో,  కోల్పోయిన ఎలక్ట్రోలైట్‌లను తిరిగి నింపడంలో సహాయపడుతుంది.  వేసవిలో దీనిని తీసుకోవడం చాలా మంచిది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది.

జీర్ణక్రియ,  ప్రేగు ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది..

సొరకాయ ఫైబర్ కు గొప్ప మూలం.  ఇది ప్రేగు కదలికలను నియంత్రించడంలో, మలబద్ధకాన్ని నివారించడంలో,  ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌ను కూడా ప్రోత్సహిస్తుంది.  జీర్ణక్రియకు సహాయపడుతుంది,  కడుపుల యాసిడ్ రిఫ్లెక్షన్ ను  తగ్గిస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది..

సొరకాయ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI)  కలిగి ఉంటుంది. ఇది  మధుమేహ వ్యాధిగ్రస్తులకు గొప్ప ఎంపిక. ఇందులో ఉండే కరిగే ఫైబర్ గ్లూకోజ్ శోషణను నెమ్మదిస్తుంది.  రక్తంలో చక్కెర స్థాయిలు ఆకస్మాత్తుగా  హెచ్చుతగ్గులు కావడాన్ని నివారిస్తుంది.

బరువు తగ్గడంలో సహాయపడుతుంది..

సొరకాయలో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్  ఉండటం వల్ల ఇది సహజంగా బరువు తగ్గించే ఆహారంగా మారుతుంది. "బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక గొప్ప ఎంపిక.  ఎందుకంటే  సొరకాయను ఏ రూపంలో తీసుకున్నా ఇది ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్  ఇస్తుంది.

గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది..

పొటాషియం,  యాంటీఆక్సిడెంట్లతో నిండిన సొరకాయ రక్తపోటును నియంత్రించడంలో,  కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే స్టెరాల్స్  హృదయనాళ పనితీరుకు  సపోర్ట్ చేస్తాయి.

ఎవరు తినకూడదు..

సొరకాయలో చేదు రుచి ఉండటం ఒక ప్రధాన సమస్య. ఇది వికారం, వాంతులు, విరేచనాలు,  తీవ్రమైన సందర్భాల్లో ఆసుపత్రిలో చేరడానికి దారితీసే విషపూరిత సమ్మేళనం. వంట చేసే ముందు ఎల్లప్పుడూ ఒక చిన్న ముక్కను రుచి చూడాలి. అది చేదుగా ఉంటే వెంటనే దాన్ని తినకుండా ఉండటం మంచిది.

తక్కువ రక్తపోటు ఉన్నవారు, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉన్నవారు, బీటా-బ్లాకర్స్ తీసుకుంటున్న వ్యక్తులు,  ఉబ్బరం, విరేచనాలకు గురయ్యే అవకాశం ఉన్నవారు సొరకాయ తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

                                   *రూపశ్రీ

 

గమనిక:


ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...