వేసవి కాలంలో పచ్చి మామిడి తింటే ఇన్నిలాభాలా?

 

వేసవి అంటే చాలా మంది ఎదురుచూసేది మామిడి పండ్ల కోసమే. పండ్లకు రారాజు అయిన మామిడి సువాసన నుండి రుచి వరకు మైమరచిపోయేలా చేస్తుంది. అయితే చాలామంది పచ్చి మామిడిని కూరలు, పచ్చళ్ల కోసం,  పండిన మామిడిని జ్యూసులు,   నేరుగా తినడం కోసం ఉపయోగిస్తారు. కానీ వేసవిలో పచ్చి మామిడిని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పులుపును బాగా ఇష్టపడేవారు మామిడిని బాగా తింటుంటారు. కానీ పచ్చి మామిడిని అందరూ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే..


పచ్చి మామిడి వల్ల కలిగే ప్రయోజనాలు..


వేసవికాలంలో చాలామంది భయపడేది వడదెబ్బకు.  అయితే ఈ వడదెబ్బకు చెక్ పెట్టేది పచ్చి మామిడి.  పచ్చి మామిడి పండును కాస్త ఉడికించి అందులో తగినంత నీరు పోసి మిరియాలు,  ఉప్పు లేదా పంచదార వంటివి కలిపి తాగితే వడదెబ్బ భయమే ఉండదు. వేసవిలో శరీరం డీహైడ్రేట్ కావడాన్ని ఇది చెక్ పెడుతుంది.


పచ్చి మామిడిలో పొటాషియం,  ఇతర ఎలక్ట్రోలైట్లు ఉంటాయి.  ఇవి వేసవిలో చెమట పట్టడం వల్ల కలిగే ఎలక్ట్రోలైట్ల అసమతుల్యతను భర్తీ చేయడంలో సహాయపడుతుంది. సాధారణంగా కొబ్బరి బొండం వంటి పానీయాలలో ఉండే ఎలక్ట్రోలైట్లు పచ్చి మామిడిలో కూడా ఉంటాయి. కాబట్టి పచ్చి మామిడిని తప్పక తినాలి.

పచ్చి మామిడిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది.  ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.  వేసవిలో జీర్ణసమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అలాంటి జీర్ణసమస్యలకు చెక్ పెట్టాలంటే పచ్చి మామిడి కాయను ఆహారంలో తీసుకుంటూ ఉండాలి.


పుల్లగా ఉన్న పండ్లలో విటమిన్-సి సమృద్జిగా ఉంటుంది.  పచ్చి మామిడి కూడా అలాంటి వాటిలో ఒకటి. పచ్చి మామిడిని ఆహారంలో తీసుకుంటే శరీరానికి కావలసిన విటమిన్-సి లభిస్తుంది.  శరీరంలో వేడి సంబంధిత వ్యాధులతో పోరాడటానికి ఇది సహాయపడుతుంది.  పైగా రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది.


పచ్చి మామిడి కాయలు ఆల్కలీన్ ల7ణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో ఆమ్ల స్థాయిలను సమతుల్యం చేస్తాయి.  శరీరంలో ఆమ్లత అంటే యాసిడ్ స్థాయిలను తగ్గిస్తాయి.  


పచ్చి మామిడి కాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది.  ఇది శరీరాన్ని లోపలి నుండి చల్లగా ఉంచుతుంది.  పచ్చి మామిడి కాయతో చారు లాగా చేసుకుని ఆహారంలో తీసుకుంటే  శరీరానికి చలువ చేస్తుంది. వేసవి వేడి తగ్గుతుంది.

                                 *రూపశ్రీ.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...