కేసీఆర్ మెడ పట్టి గెంటివేశారు

 

టీఆర్ఎస్ నేత బొడిగె శోభ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో పార్టీలో చేరారు. శోభతో పాటు మాజీ ఎమ్మెల్యే బాలు నాయక్‌ కూడా బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ బొడిగె శోభకు జరిగిన అన్యాయమే టీఆర్‌ఎస్‌ మోసానికి నిదర్శనమని అన్నారు. బెయిల్‌పై వచ్చి మహాకూటమి నేతలు ఓట్లు అడుగుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తుకు ప్రాతిపదిక ఏంటని లక్ష్మణ్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ నుంచి ఎవరు గెలిచినా టీఆర్‌ఎస్‌లోకి వెళ్తారని ఆయన జోస్యం చెప్పారు. బొడిగె శోభ మాట్లాడుతూ కేసీఆర్‌ బంధువులు రవీందర్‌రావు, సంతోష్‌ వల్లే తనకు టికెట్‌ రాలేదని అన్నారు. తాను బాగా పనిచేస్తున్నానని చెప్పారని,మరి టిక్కెట్ ఎందుకు ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు.

గత 70రోజులుగా ఎదురు చూసినా సీఎం కేసీఆర్ తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తనను రాజకీయ సమాధి చేయడం కోసం డభ్భై రోజులు ఆపారని ధ్వజమెత్తారు.చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మళ్లీ అసెంబ్లీకి పంపాలని శోభ కోరారు. తనకు జరిగిన అన్యాయానికి ప్రజలే తీర్పు ఇవ్వాలన్నారు. పార్లమెంట్‌లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కావాలని కవిత కోరుతున్నారని, తెరాసలో కవిత ఒక్కరే ఉంటే సరిపోతుందా.. వేరే మహిళలు ఉండొద్దా? అని ప్రశ్నించారు.తన తడాఖా ఎంటో ఎన్నికల్లో చూపిస్తానని సవాల్ విసిరారు. కేసీఆర్‌ కుటుంబపాలనపై యుద్దం చేయాలని నిర్ణయించుకున్నానన్నారు.టీఆర్‌ఎస్‌లో ఉద్యమకారులకు ప్రాధాన్యత లేదని,అగ్రవర్ణాలకే పెద్దపీట అని విమర్శించారు.