పాము విషంతో నొప్పి మాయం

 

పాము విషాన్ని మందులలో వాడటం చాలా అరుదు. పాము కాటుకు విరుగుడుగానే వాటి విషాన్ని వాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు  Blue Coral Snake అనే ఒక పాము విషంతో నొప్పి మాత్రలను రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 

ఆసియాకే పరిమితం

Blue Coral Snake ఆగ్నేయ ఆసియాలో మాత్రమే కనిపించే ఒక విషపూరితమైన పాము. ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్, సింగపూర్‌, బర్మా వంటి దేశాలలోనే ఇది కనిపిస్తుంది. శరీరం అడుగున నీలంగానూ, పైభాగంలోనూ నల్లగానూ ఉండే ఈ పాము తల, తోకా మాత్రం ఎరుపు రంగులో ఉండి దూరం నుంచే భయపెడుతుంటుంది.

 

కిల్లర్‌ ఆఫ్ కిల్లర్స్‌

Blue Coral Snake ఎక్కువగా మిగతా పాములని తినేందుకే ఇష్టపడుతుంది. అది కూడా అలాంటి ఇలాంటి పాములను కాదు... తాచుపాముల్ని సైతం ఇది దిగమింగేస్తుంది. అందుకనే దీనికి ‘కిల్లర్‌ ఆఫ్ కిల్లర్స్’ అని పేరు పెట్టారు. ఆరగుడుల వరకూ పొడవు పెరిగే ఈ పాముల కోరలు మిగతాపాములన్నింటికంటే పెద్దవిగా ఉంటాయి. వాటి శరీరంలో నాలుగో వంతు కోరలతో... కాటు వేసిన వెంటనే శత్రువుని చంపేయగల ప్రభావం వీటికి ఉంటుంది.

 

విషం తీరే వేరు

సాధారణంగా పాము విషాలలో న్యూరోటాక్సిన్స్‌ ఉంటాయి. ఇవి నాడీవ్యవస్థను దెబ్బతీసి శత్రువుని నిదానంగా చంపేస్తాయి. ఇలాంటి పాములు కరిచినప్పుడు శత్రువు నిస్త్రాణంగా మారిపోయి, తనకు తెలియకుండా మృత్యువు మత్తులోకి జారిపోతాడు. కానీ పాముల్ని సైతం చంపి తినాలంటే అంతకు మించిన విషం ఉంటేనే సాధ్యం కదా! అందుకనే Blue Coral పాము విషం వెనువెంటనే కండరాల మీద పనిచేసేదిగా ఉంటుంది. అందుకనే ఇప్పటి వరకూ ఈ పాము విషానికి విరుగుడు కూడా కనుక్కోలేకపోయారు.

 

నొప్పికి విరుగుడుగా

Blue Coral పాము విషం మనిషి శరీరంలోకి ప్రవేశించినప్పుడు అది కేలియోటాక్సిన్‌ అనే రసాయనాన్ని విడుదల చేస్తుందట. ఈ రసాయనం మనలోని సోడియం ఛానల్స్ అనే కణాలను ప్రభావితం చేసినట్లు తేలింది. మనిషికి నొప్పి తెలిసేందుకు ఈ సోడియం ఛానెల్సే కారణం. ఈ ఒక్క సూత్రం ఆధారంగా Blue Coral పాము నుంచి నొప్పి మందుని సేకరించగలిగితే అది చికిత్సా రంగంలో అద్భుతమే అంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే ఇలా తయారుచేసే మందు వలన ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవట.

 

దురదృష్టం ఏమిటంటే తరగిపోతున్న అడవుల కారణంగా Blue Coral పాములలో 80 శాతం జీవులు అంతరించిపోయాయి. ఎక్కడో ఒకటీ అరా తప్ప మనుషులకు కనిపించడం మానేశాయి. ఆ ఒకటీ అరా పాముల్ని వెతికి పట్టుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ కారణంగా అయినా పాపం వాటి జాతి అంతరించిపోకుండా ఉంటుందేమో చూడాలి.


 

- నిర్జర.