అప్పుడు మోడీకి గుడి.. ఇప్పుడు బీజేపీకి గుడ్ బై

మోడీ ప్రతిష్ఠ మసకబారుతోందనడానికి తాజా ఉదాహరణ ఇది. మయూర్ ముండే.. ఈ పేరు పెద్దగా ఎవరికీ పరిచయం ఉండకపోవచ్చు. కానీ ప్రధాని మోడీకి గుడికట్టిన బీజేపీ కార్యకర్తగా ఆయనను అందరూ గుర్తుపడతారు. పూణెకు చెందిన మయూర్ ముండే  మోడీకి వీర భక్తుడు. ఎంతటి భక్తుడంటే మయూర్ ముండే దృష్టిలో మోడీ ఒక దేవుడు. ఎందరు వద్దన్నా, పెద్ద పెద్దవారు అభ్యంతరం పెట్టినా, చివరాఖరికి బీజేపీ జాతీయ నాయకత్వం వారించినా కూడా లెక్క చేయకుండా 2021లో ఆయన మోడీకి ఏకంగా ఒక గుడి కట్టేశారు. ఎందుకంటే మోడీని పూజించడానికి ఒక చోటు కావాలి. అది ఈ గుడే కావాలి అంటూ గట్టిగా వాదించారు. 

అటువంటి మయూర్ ముండే ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసేశారు. తన రాజీనామా లేఖలో బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు  చేశారు. పార్టీ మౌలిక సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చేసిందని విమర్శలు గుప్పించారు. ఇప్పుడు బీజేపీకి అధికారమే పరమావధిగా మారిపోయిందని పేర్కొన్నారు. ఇందు కోసం పార్టీ బయట నుంచి రాజకీయ నాయకులను దిగుమతి చేసుకుంటోందనీ, దీర్ఘ కాలంగా పార్టీలో ఉంటూ విధేయులుగా ఉన్న వారిని పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు. తన దేవుడు మోడీ కూడా అధికారం వచ్చాకా మారిపోయారనీ, ఆ అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఏ మాత్రం సమంజసం కాదని భావిస్తున్నాననీ మయూర్ ముండే తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.