మమత కోసం ఈటలకు హ్యాండిస్తారా?

హుజూరాబాద్ లో గెలిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరున్నొక్క రాగాలు ఆలాపిస్తుంటే కేంద్రంలోని బీజేపీ నేతల ప్రియారిటీస్ క్షణక్షణం మారుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు బీజేపీ నేతలకు ఈటల రాజేందర్ గెలుపే ముఖ్యంగా కనిపిస్తున్నప్పటికీ ఇప్పుడా ప్రాధాన్యం తగ్గుతుందన్న వ్యాఖ్యానాలు ఢిల్లీలో వినిపిస్తున్నాయి. అందుక్కారణం మమత ఢిల్లీ మీద కన్నేయడమేనంటున్నారు. 

బెంగాల్ సీఎం మమత మొన్నటి ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. అయినా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. ఆరు నెలల్లో ఉపఎన్నికల్లో గెలిస్తే ఆమె సీఎంగా కొనసాగుతారు. లేకపోతే తన వీరవిధేయుడికి సీఎం కుర్చీ త్యాగం చేయాల్సి వస్తుంది. అదే జరిగితే బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కు భారీగా బీటలు  పడటం ఖాయంగా భావిస్తున్నారు. ఇదే విషయం మమతను కూడా ఆందోళనలో పడేసింది. అందుకే బెంగాల్లో ఇప్పటివరకు డిమాండ్ రూపంలో కూడా లేని విధానసభ అంశాన్ని ముందుకు తెస్తున్నారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే బెంగాల్లో మమత సీటు కిందికి నీళ్లు రావడం ఖాయమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే తృణమూల్ కాంగ్రెస్ లో అలజడి రేగుతుంది. అసంతృప్తులు, నిరసనకారుల సంఖ్య పెరుగుతుంది. వారందరినీ కంట్రోల్ చేసే యుక్తి గానీ, సామర్థ్యం గానీ మమతకు ఉన్నంతగా ఆమె విధేయులకు ఉండే అవకాశమే లేదు. ఇది జరగకుండా ఉండేందుకే ఆ రాష్ట్రంలో విధానసభ పెట్టాలని మమత హడావుడిగా పావులు కదుపుతున్నారు. ఆమె పోటీ చేయాల్సి ఉన్న భవానీపూర్ ఇప్పటికే ఖాళీగా ఉంది. 

మమతను అట్నుంచి అటే ఇంటికి పంపించేందుకు బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. కరోనా థర్డ్ వేవ్ సాకుతో కేంద్రం ఆధీనంలో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం భవానీపూర్ ఎన్నికను ఇప్పట్లో నిర్వహించే అవకాశం కనిపించడం లేదన్న ఊహాగానాలు ఢిల్లీలో షికార్లు చేస్తున్నాయి. బీజేపీ హైకమాండ్ ఆలోచన మేరకే బెంగాల్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ ఆలస్యం కావచ్చని, అందువల్ల హుజూరాబాద్ కు కూడా నోటిఫికేషన్ వచ్చే చాన్స్ లేదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలా అనివార్య పరిస్థితుల్లో హుజూరాబాద్ లో ఉపఎన్నిక ఆలస్యమవుతున్నకొద్దీ అది ఈటల సానుభూతి పవనాలను బలహీనం చేస్తుందని, దీనివల్ల ఈటల సర్వశక్తులు ఒడ్డినా గెలుపు అంత సులభం కాదని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది.

తమ మీద వస్తున్న వ్యతిరేకతను తగ్గించుకోవాలంటే బీజేపీ నేతలకు ఈటల గెలుపు కన్నా మమతను ఇంటికి పంపించడమే ముఖ్యం. కాబట్టి హుజూరాబాద్ అంశాన్ని బీజేపీ నేతలు అటకెక్కించడం ఖాయమన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ భవానీపూర్ ఎన్నిక ఆలస్యమైతే ఈటల రాజకీయ భవిష్యత్తును బీజేపీ నేతలే చేజేతులా పాడు చేసినట్లవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రేపేం జరుగుతుందో చూడాలి మరి..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu