ఆ డాన్సర్ ను రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోవాలి

 

మామూలుగానే రాజకీయ నాయకులు ప్రత్యర్థుల మీద హద్దు మీరి విమర్శలు చేస్తారు. ఇక ఎన్నికల సమయంలో అయితే వారి నోటికి హద్దు అదుపే ఉండదు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్.. రాహుల్ గాంధీ కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటలీలో డాన్సర్ అయిన సోనియా గాంధీని, రాజీవ్ గాంధీ పెళ్లి చేసుకున్నట్లు.. డాన్సర్ సప్నా చౌదరిని రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోవాలని వ్యాఖ్యానించారు.

సప్నా చౌదరి పేరు మోసిన హరియాణా గాయని, డాన్సర్‌ కూడా. 2018లో నెట్లో అత్యధికులు సెర్చ్‌ చేసిన సెలబ్రిటీల్లో ఆమెకూడా ఒకరని గూగుల్‌ ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఆమె పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. ఎందుకంటే.. ‘సప్నా చౌదరి కాంగ్రెస్ లో చేరింది.. వెల్‌కమ్‌ టూ కాంగ్రెస్‌ ఫ్యామిలీ’ అని యూపీసీసీ చీఫ్‌ రాజ్‌బబ్బర్‌ ట్వీట్‌ చేశారు. ప్రియాంక గాంధీతో కలిసి ఉన్న ఆమె ఫోటోను కూడా ఆయన షేర్‌ చేశారు. మధుర నియోజకవర్గంలో బాలీవుడ్‌ నటి, సిట్టింగ్ ఎంపీ హేమమాలినిపై సప్నా చౌదరిని నిలబెట్టాలన్నది కాంగ్రెస్‌ వ్యూహమని ప్రచారం జరిగింది. అయితే ఆమె దీన్ని ఖండిస్తూ.. తాను కాంగ్రెస్‌లో చేరలేదనీ, అసలు ఏ పార్టీ తరపునా పోటీ కూడా చేయట్లేదని, ప్రియాంకతో ఉన్న ఫోటో కూడా పాతదని ఓ ప్రకటన విడుదల చేసింది. షాక్‌ తిన్న కాంగ్రెస్‌ ఆమె కాంగ్రెస్‌లో చేరేందుకు ఫారం నింపుతున్న ఓ వీడియోను బయటపెట్టడంతో అది వైరల్‌ అయ్యింది. ‘ఆమె స్వయంగా శనివారం నాడు పార్టీ ఆఫీసుకొచ్చి ఫారం నింపి వెళ్లారు. ఆమె సోదరి కూడా కాంగ్రెస్‌లో చేరారు’ అని యూపీసీసీ ప్రధాన కార్యదర్శి నరేంద్ర రథి ప్రకటించారు. దీంతో సప్నా చౌదరి కాంగ్రెస్ లో చేరి వెంటనే యూటర్న్ తీసుకున్నారని అర్ధమవుతోంది.

అసలే ఎన్నికల సమయం కావడంతో సప్నా కాంగ్రెస్ లో చేరారని వార్తలు రాగానే బీజేపీ విమర్శలు చేయడం మొదలుపెట్టింది. ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యే సురేంద్రసింగ్‌ ఓ అడుగు ముందుకేసి.. ‘రాహుల్‌ ఆమెను పెళ్లి చేసుకుంటే బావుంటుంది. ఎందుకంటే ఇటలీలో రాహుల్‌ తల్లి సోనియా ఏం వృత్తి చేసేవారో సప్నా చౌదరి కూడ ఇప్పుడదే పనిచేస్తోంది. మీ నాన్న (రాజీవ్‌) సోనియాను పెళ్లి చేసుకున్నట్లే మీరు ఆమెను పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. అప్పుడు అత్తాకోడళ్లు.. ఒకే సంస్కృతి, వృత్తికి చెందినవారవుతారు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలను నెటిజన్లు తప్పుపడుతున్నారు. రాజకీయంగా విమర్శలు చేసుకోవాలి కానీ ఇలా స్త్రీల గురించి మాట్లాడడం ఏంటంటూ మండిపడుతున్నారు.