తెలుగు రాష్ట్రాలపై ఆశలకు బీజేపీ తిలోదకాలు?!

దక్షిణాదిపై మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై తనకు ఉన్న చిన్న చూపును బీజేపీ హైకమాండ్ మరోసారి తేటతెల్లం చేసింది.  పేరుకు తెలుగు రాష్ట్రాలపై తనకు అపారమైన గౌరవాభిమానాలున్నాయని చెప్పుకునే బీజేపీ అధిష్ఠానం ఆచరణలో మాత్రం ఆ రాష్ట్రాలకు ఇచ్చే ప్రాధాన్యత కూరలో కరివేపాకు చందమేనని మరో సారి చాటుకుంది.  

జులై 24న 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీని కోసం బీజేపీ ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను చూస్తే తెలుగు రాష్ట్రాలపై ఆ పార్టీకి ఉన్న చిన్న చూపు ఎంత అన్నది అర్ధమౌతుంది.  రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో తెలుగు రాష్ట్రాలకు బీజేపీ శూన్య హస్తాన్నే చూపింది. రాజ్యసభ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటి వరకూ  గుజరాత్‌ నుంచి బాబు బాయి జేసంగ్‌ బాయ్‌, కే శ్రీదేవన్స్‌ జాలా, బెంగాల్‌ నుంచి అనంత్‌ మహారాజ్‌కు అవకాశం ఇచ్చింది. ఇప్పటికే గుజరాత్‌ నుంచి కేంద్రమంత్రి జైశంకర్‌ పేరును నామినేట్‌ చేసిన విషయం తెలిసిందే.  

అయితే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క బీజేపీ నేతకు కూడా అవకాశం ఇవ్వలేదు. ముందుగా అయితే   బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, మాజీ ఎంపి గరికపాటి మోహన్‌రావు పేరు రాజ్యసభ సభ్యత్వం దక్కే అవకాశాలున్నాయని బాగా ప్రచారం అయ్యింది.  అయితే బీజేపీ హై కమాండ్ మాత్రం తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరినీ పరిశీలించలేదని తేలిపోయింది. వాస్తవానికి నిన్న మొన్నటి వరకూ అంటే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు వరకూ తెలంగాణపై బీజేపీ భారీ ఆశలు పెంచుకుంది. ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే తరువాయి అన్నంతగా హడావుడి చేసింది. కర్నాటక ఎన్నికల ఫలితాల అనంతరం మాత్రంమే తెలంగాణలో బీజేపీ వాపును చూసి బలుపు అనుకుందన్న విషయం బయటపడింది. దక్షిణాదిలో పాగా వేయాలన్న ఆకాంక్షలు ఇప్పటిలో నెరవేరే అవకాశాలు లేవని రూఢీ అయిన తరువాత బీజేపీ ఇప్పుడు ఆ రాష్ట్రాలలో నేతలకు   రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి ఉపయోగం లేదన్న నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టమౌతోంది.

అలా ఇచ్చినా కూడా ఆయా రాష్ట్రాల పార్టీ క్యాడర్ లో కొత్త జోష్ నింపే అవకాశాలు ఇసుమంతైనా లేవన్న నిర్ణయానికి బీజేపీ హై కమాండ్ వచ్చేసినట్లుగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలలో అధికారంపై ఇసుమంతైనా ఆశలు లేకపోవడం వల్లనే రాజ్యసభ విషయంలో ఆ రాష్ట్రాల నుంచి ఎవరినీ కనీసం పరిశీలించలేదన్న భావన పొలిటికల్ సర్కిల్స్ లో కూడా వ్యక్తమౌతోంది. ఇప్పటికే తెలంగాణ నుంచి లక్ష్మణ్, ఏపీ నుంచి జీవీఎల్ ను ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభకు పంపిన సంగతి విదితమే. అయితే వారి వల్ల తెలుగు రాష్ట్రాలలో పార్టీకి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని బీజేపీ హై కమాండ్ భావిస్తున్నట్లు పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.    

Online Jyotish
Tone Academy
KidsOne Telugu