గవర్నర్ పదవిపై ఇంద్రసేన ఆశలు..! మోడీ-షా గుర్తిస్తారని నమ్మకం

 

ఇంద్రాసేనారెడ్డి... ఒకప్పుడు తెలంగాణ బీజేపీలో ఒక వెలుగు వెలిగిన నాయకుడు... తెలంగాణ బీజేపీ మోస్ట్ సీనియర్ లీడర్లలో ఇంద్రసేన ఒకరు... తెలంగాణ నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో బీజేపీ నుంచి మూడుసార్లు గెలిచిన అతికొద్ది మందిలో ఇంద్రసేనారెడ్డి ఒకరు. మొదట విద్యార్ధి విభాగంలో పనిచేసిన ఇంద్రసేన... 1980 నుంచి బీజేపీలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. జాతీయ స్థాయిలోనూ, అలాగే ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఇంద్రసేన హయాంలోనే తెలంగాణలో పార్టీ పుంజుకుంది. అంతేకాదు, ప్రస్తుతమున్న బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ఇంద్రసేనారెడ్డి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నిర్మించినదే. రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ ఉన్నతి కోసం అహర్నిశలు కృషిచేసిన ఇంద్రసేన ప్రస్తుతం పార్టీ ఆఫీస్ కే పరిమితమయ్యారు. తెలంగాణ బీజేపీలో సీనియర్ గా ఉన్నప్పటికీ తనకు దక్కాల్సిన గుర్తింపు దక్కడం లేదని ఆవేదన చెందుతున్నారు.

రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన చాలామందికి పార్టీ సముచిత స్థానం కల్పించడంతో... తనకు కూడా ఏదోఒక మంచి పదవి ఇవ్వకపోతుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే, విద్యాసాగర్ రావు ఇప్పటికే గవర్నర్ గా పనిచేసి రాగా, ప్రస్తుతం దత్తాత్రేయ హిమాచల్ గవర్నర్‌గా, కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా బాధ్యతల్లో ఉన్నారు. ఇక, ఇంద్రసేనారెడ్డి ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడి హోదాలో పని చేస్తున్నారు. అయితే, ఇంద్రసేనారెడ్డి గవర్నర్ పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అటు కేంద్రం... ఇటు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేనప్పుడు పార్టీ బలోపేతానికి కృషిచేసిన తనను మోడీ-షాలు గుర్తిస్తారన్న నమ్మకంతో ఇంద్రసేన ఉన్నారు. 

అయితే, ముక్కుసూటితనం, నిక్కచ్చిగా ఉండటమే ఇంద్రసేనారెడ్డి ఎదుగుదలకు ఆటంకంగా మారాయని ఆయన సన్నిహితులు, అనుచరులు అంటున్నారు. ఏదేమైనా, పార్టీ కోసం సిన్సియర్ గా పనిచేసిన ఇంద్రసేనారెడ్డికి, సరైన గౌరవం ఇవ్వట్లేదని, ఆయనను ఆఫీస్ కే పరిమితం చేయడం భావ్యం కాదని బాధను వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా, మరి పదవిని కట్టబెట్టి గౌరవించాలని కోరుతున్నారు. మరి, ఇంద్రసేనారెడ్డి ఆశిస్తున్నట్లుగా బీజేపీ అధిష్టానం మంచి పదవిని కట్టబెడుతుందో లేదో చూడాలి.