బీజేపీ తేల్చేసింది!.. తెలుసుకోవలసింది తెలుగుదేశం, జనసేనే!
posted on May 23, 2023 3:52PM
ఏపీలో బీజేపీ స్టాండ్ ఏమిటన్నది స్పష్టంగా తేలిపోయింది. ఏవో ఏవేవో రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ సర్కార్ పై చార్జిషీట్లు అంటూ హడావుడి చేస్తున్నా.. బీజేపీ వాస్తవంగా రాష్ట్రంలో జగన్ సర్కార్ కు మద్దతుగానే ఉండాలన్న కృత నిశ్చయంతో ఉందని తేలిపోయింది.
ఇంకా అమయాకంగా జనసేనాని పవన్ కల్యాణ్ బీజేపీ మా మిత్ర పక్షం.. రాష్ట్రంలో మరో సారి వైసీపీ సర్కార్ అధికారంలోకి రాకుండా ఉండేందుకు బీజేపీని కూడా కలుపుకుపోయేందుకు ప్రయత్నం చేస్తున్నానంటూ కాలం గడిపేయడం వాస్తవాన్ని చూడకుండా కళ్లు మూసుకోవడమే అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అందుకోసం బీజేపీ పెద్దలతో మాట్లాడతాను అని పవన్ ఇప్పటికీ అనడం అమాయకత్వమేనంటున్నారు. బీజేపీకి ఏపీలో కనీసం ఒక శాతం కూడా ఓటు బ్యాంకు లేదన్నది తెలిసిన విషయమేనని గుర్తు చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండటం.. ఎన్నికల సమయంలో వ్యవస్థలను మేనేజ్ చేస్తుందన్న భయం, అనుమానంతోనే జనసేన, తెలుగుదేశం పార్టీలు కమలం పార్టీ పట్ల సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారని రాజకీయ వర్గాలలో గట్టిగా చర్చ జరుగుతోంది.
కర్నాటక ఫలితాల తరువాతనైనా ఎన్నికల సమయంలో వ్యవస్థలను మేనేజ్ చేయడం అంత సులభం కాదని ఆ పార్టీలు తెలుసుకోవాలని, సొంత బలం, పోల్ మేనేజ్ మెంట్ పై గట్టిగా దృష్టి పెట్టాలని పరిశీలకులు సూచిస్తున్నారు.తాజాగా.. మోడీ సర్కార్ రెవెన్యూ లోటు నిధులు అంటూ ఏపీ కి 10,460. 87 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఇదేమీ ఇప్పటి లోటు కాదు. రాష్ట్ర విభజన సమయంలో ఏర్పడిన లోటు. ఆ లోటును భర్తీ చేయాలని నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత అప్పట్లో ఎన్ని ప్రయత్నాలు చేశారో.. ఎన్ని సార్లు హస్తిన పర్యటించారో.. ఎన్ని సార్లు స్వయంగా మోడీని కలిసి విజ్ణప్తి చేశారో లేక్కే లేదు. తరువాత తరువాత మోడీ చంద్రబాబుకు అప్పాయింట్ మెంట్ ఇవ్వకుండా మొహం చాటేశారు. అది వేరే సంగతి.
నిధుల కోసమే, విభజన హామీల అమలు కోసమే అప్పట్లో తెలుగుదేశం ఎన్డీయేతో గొడవ పడింది. బయటకు వచ్చేసింది. అంతేనా అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వంటి మంత్రులు రక్షణ నిధులను ఇచ్చేయమంటారా అంటూ ఎద్దేవా కూడా చేశారు. అలాంటిది కేంద్రానికి ఇప్పుడు హఠాత్తుగా ఏపీ మీద కాదు కాదు జగన్ సర్కార్ మీద ఎక్కడ లేని ప్రేమా పుట్టుకొచ్చేసింది. అడగకుండా పెట్టకుండా.. జగన్ ఆర్థిక కష్టాలు తీర్చేయడానికి ఆఘమేఘాల మీద నిధులు విడుదల చేసేసింది. దీంతో ఎన్నికల సంవత్సరంలో జగన్ సర్కార్ కు ఆర్థిక చీకాకులు లేకుండా సహకారం అందించింది. ఇది చాలదన్నట్లూ ఎప్పుడడిగితే అప్పుడు అప్పులు తీసుకోవడానికి పచ్చ జెండా చేతిలో పట్టుకుని రెడీగా నిలుచుంటోంది.
దీంతో ఏపీ విషయంలో బీజేపీ వైఖరి ఏమిటో.. ఆ పార్టీ ఎటువైపు ఉంటుందో, ఎవరికి మద్దతుగా నిలుస్తోందో? నిలుస్తుందో అందరికీ పూర్తిగా అర్ధమైపోయింది. అసలు ఇప్పుడేమిటి? గత నాలుగేళ్లుగా బీజేపీ ఎలాంటి దాపరికం లేకుండా తన వైఖరి ఏమిటో చెబుతూనే వస్తోంది. జనసేనానికే ఇంకా పూర్తిగా అర్ధమైనట్లు కనిపించడం లేదు. అలాగే తెలుగుదేశం కూడా జనసేన అధినేత బీజేపీ అగ్రనాయకత్వాన్ని ఏపీలో వైసీపీకి వ్యతిరేక వైఖరి తీసుకునేల ఒప్పించగలరన్న ఆశ అంటూ ఏమైనా ఉంటే దానిని వదిలేసుకుని ముందుకు నడవాల్సిన అవసరం ఉంది.