మోడీ స్థాయిని బీజేపీ నేతలే తగ్గించేస్తున్నారేమిటో?

 

డిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ ఓడిపోయినంత మాత్రాన్న మోడీ ప్రభావం తగ్గిందని ప్రతిపక్షాలు ప్రచారం చేయడం సరికాదని బీజేపీ నేత పురందేశ్వరి అన్నారు. ఇటీవల ఓడిషా రాష్ట్రంలో జరిగిన మునిసిపల్ ఎన్నికలలో తమ పార్టీ ఘనవిజయం సాధించిందని ఆమె తెలిపారు. ఒక రాష్ట్రంలో జరిగిన మునిసిపల్ ఎన్నికలలో విజయం సాధించడాన్ని మోడీ ప్రభావాన్ని కొలమానంగా పురందేశ్వరి పేర్కోవడం పెద్ద పొరపాటని చెప్పవచ్చును.

 

నిజానికి డిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో మోడీ ప్రభావం ఆధారంగా జరిగినవి కావు. డిల్లీలో నివసిస్తున్న నిరుపేద, సామాన్య మధ్యతరగతి ప్రజలు నిత్యం ఎదుర్కొనే అనేక స్థానిక సమస్యలను ఆమాద్మీ పార్టీ తన ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తూ, వాటిని పరిష్కరిస్తాననే హామీతో ప్రజలను ఆకట్టుకోగలిగింది. అధికారుల అవినీతితో విసిగి వేసారిపోయిన వ్యాపార వర్గాలను అవినీతిని అంతం చేస్తానని హామీ ఇచ్చి ఆకట్టుకొంది. అరవింద్ కేజ్రీవాల్ క్రిందటి సారి తన 49 రోజుల పరిపాలనలో అవినీతిపై ఏవిధంగా పోరాడారో సామాన్య ప్రజలకు కళ్ళకు కట్టినట్లు సాక్ష్యాలతో సహా చూపడం వలన ప్రజలు ఆయన వైపు ఆకర్షితులయ్యారు.

 

బీజేపీ కూడా అటువంటి హామీలే ఇచ్చింది. కానీ డిల్లీ ప్రజలు ప్రాధాన్యత ఇస్తున్న స్థానిక సమస్యలు, అవినీతి, మహిళకు రక్షణ అనే మూడు అంశాలపై బీజేపీ తన వైఖరిని సమర్ధంగా ప్రచారం చేసుకోలేకపోయింది. బీజేపీ, ఆమాద్మీ పార్టీలు అమలుచేసిన ఎన్నికల వ్యూహాలు కూడా ఆ పార్టీల జయాపజయాలకు కారణమయ్యాయి. కనుక ఆ ఎన్నికలు మోడీ ప్రభావానికి గీటురాయి కానేకావు. కానీ ప్రతిపక్షాలకు అందివచ్చిన ఆ అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకొంటూ మోడీ ప్రభావం తగ్గిందని ప్రచారం చేసుకొంటున్నాయి అంతే.

 

దానిని చూసి బీజేపీ నేతలు కంగారుపడిపోతూ ఏదో ఒక రాష్ట్రంలో జరిగిన మునిసిపల్ ఎన్నికలను కూడా మోడీ ప్రభావాన్ని కొలిచేందుకు ప్రమాణంగా చెప్పుకొంటే వారే ఆయన స్థాయిని స్వయంగా తగ్గించుకొంటున్నట్లవుతుంది. రేపు తమ పార్టీ ఏ ఎన్నికలలో ఓడిపోయినా అప్పుడు బీజేపీ నేతలందరూ ఈవిధంగానే సంజాయిషీలు చెప్పుకోవలసిన దుస్థితి ఏర్పడుతుంది. దాని వలన ప్రజలకు తప్పుడు సంకేతాలిచ్చినట్లవుతుంది కూడా.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu