తెలంగాణ యాసను అక్షరాల్లో పొదిగి.. తెలుగు పాఠకుల మనసులో ఒదిగి

పాకాల యశోద రెడ్డి
(8ఆగస్టు 1929 - 7 అక్టోబర్ 2007)

సాహిత్యంలోని అనేక ప్రక్రియలను తన కలం ద్వారా సృజించినప్పటికీ పల్లె తెలంగాణను అక్షరాల ఆవిష్కరించిన ఎచ్చమ్మ కథలు ఆమెకు గుర్తింపు నిచ్చాయి. అచ్చమైన తెలంగాణ మాండలికంలో కథలు రాసిన తొలి తరం తెలంగాణ రచయిత్రిగా చరిత్రలో ఆమె పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. ఆమే ప్రముఖ రచయిత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షురాలు డాక్టర్  పాకాల యశోదారెడ్డి.

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అచ్చమైన యాస వినిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో నిరాధరణకు గురైన తెలంగాణ యానను తన కథల ద్వారా బతికించారు యశోదరెడ్డి. ప్రతి కథలోనూ తెలంగాణ గ్రామీణ ప్రాంత ఆత్మ అక్షరాల్లో పొదిగి ఉంటుంది. చదివిన తర్వాత పాఠకుల మనసులో ఒదిగిపోతుంది. దక్కన్ రేడియోలో తెలంగాణ మాండలికంలో ప్రసంగాలు చేసిన తొలి రచయిత ఆమె. యశోద రెడ్డి రచనలు భాషాభిమానులకు నిధులు. వెతుక్కుంటే అందులో ఎన్నో సామెతలు, ఉపమానాలు, చమత్కారాలు అంతర్లీనమై పాఠకులను అలరిస్తాయి. ఆమె ప్రసంగాలు విని తెలంగాణ భాష ఇంత అందమైన యాస అని చాలా మంది అబ్బుర పడేవారట.

 

మహబూబానగర్ జిల్లా బిజినేపల్లిలో యశోద జన్మించారు. ఆమె తల్లిదండ్రులు సరస్వతమ్మ, కాశిరెడ్డి. చిన్నతనంలోనే అమ్మను కోల్పోయిన ఆమె బంధువుల వద్ద పెరిగారు. చదువుపై ఆమెకు ఉన్న ఆసక్తిని గమనించిన రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి ఆమెను హైదరాబాద్ నారాయణగూడలోని మాడపాటి బాలికల పాఠశాలలో చేర్చారు. ఆ రోజుల్లో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా పనిచేసే ఆయన చదువుపై ఆసక్తి ఉన్న ఆడపిల్లలు పట్టణంలో చదువుకునేందుకు వీలుగా వసతిఏర్పాటు కూడా చేసేవారట. అలా హైదరాబాద్ లో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసిన యశోద  విజయవాడలో ఆంధ్ర మెట్రిక్ పరీక్షను ప్రత్యేక అనుమతితో రాశారు. ఆమెతో పాటు మరో ముగ్గురు అమ్మాయిలు కూడా ఈ పరీక్ష రాశారు. గుంటూరు ఎసి కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, హైదరాబాద్ ఉమెన్స్ కాలేజీలో సెకండ్ ఇయర్ పూర్తి చేశారు. 

 

కరీంనగర్ జిల్లా మానకొండూరు సమీపంలోని అన్నారం గ్రామవాసి ప్రముఖ చిత్రకారుడు పాకాల తిరుమలరెడ్డితో పెళ్లి జరిగింది. రాతకు గీత తోడైంది. భర్త ప్రోత్సాహంతో ఆమె ఉన్నత విద్య పూర్తి చేశారు. ప్రైవేట్ గా డిగ్రీ చదివి ఉస్మానియా యూనివర్సిటీ నించి ఎం.ఎ (తెలుగు), ఎం.ఎ (సంస్క-తం) పూర్తిశారు. తెలుగు సాహిత్యంలో పి హెచ్ డీ తో పాటు ఆలీగర్ యూనివర్సిటీ నించి డి.లిట్ కూడా అందుకున్నారు.  హిందీ, ఉర్దూ, కన్నడ భాషల్లో ప్రావీణ్యంతో పాటు జర్మన్ భాషలో డిప్లొమా కూడా చేశారు. 

 

కోఠీ విమెన్స్ కాలెజిలో తెలుగు అధ్యాపకురాలిగా తన ప్రస్థానం ప్రారంభించి  ఉస్మానియా యూనివర్సిటీలో ప్రోఫెసర్ పదవీవిరమణ చేశారు. యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిల్ మెంబర్ గా, కేంద్ర సాహిత్య అకాడమీ మెంబర్ గా, అధికార భాషాసంఘం అధ్యక్షురాలిగా అనేక స్థాయిలో పనిచేశారు.

 

కథ, కవిత, వ్యాస ప్రక్రియల్లో ఆమె ఎన్నో రచనలు చేశారు. వందకు పైగా కథలు రాసినా అందులో కొన్ని కథలు మాత్రమే మూడు కథా సంపుటాలుగా వచ్చాయి. ఎచ్చమ్మ కతలు బాగా ప్రాచుర్యం పొందిన కథా సంపుటి. ఉగాదికి ఉయ్యాల, భావిక కవితా సంపుటాలు, కథలూ నవలలూ-ఒక పరిశీలన, కథా చరిత్ర, భారతంలో స్త్రీ, ఆంధ్ర సాహిత్య వికాసం, హరివంశము ఉత్తర భాగము, పారిజాతాపహరణం, తెలుగులో హరివంశములు వ్యాస సంపుటాలుగా వచ్చాయి.

 

ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ రచయిత్రి అవార్డు, సుశీలా నారాయణ రెడ్డి అవార్డు, నాళం కృష్ణారావు అవార్డు, సురవరం ప్రతాపరెడ్డి అవార్డులూ అందుకున్న ఆమె ఎచ్చమ్మ కతల యశోదగా పాఠకుల మనసులో నిలిచిపోయారు. తెలంగాణ యాసలో సాగే ఆమె రచనలపై చాలామంది పరిశోధనలు చేసి డాక్టరేట్ లు అందుకున్నారు.