ఈ ఆహారాలు మీరు ఎక్కువ తింటారా? కీళ్లను చాలా వేగంగా పాడుచేస్తాయట..

మూత్రపిండాలు శరీరంలో ముఖ్యమైన అవయవాలు. ఇవి ప్రతిరోజూ 200లీటర్ల రక్తాన్ని శుద్దిచేయడం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇక కీళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కీళ్ళు ఆరోగ్యంగా లేకపోతే నడవడం, కూర్చోవడం, కదలడం, శరీర అవయవాలను ఉపయోగించడం ఇలా అన్ని విధాలా సమస్యే. ఈ కీళ్లు, మూత్రపిండాలని పాడు చేసే ఆహారాలు కొన్ని ఉన్నాయి. ఈ ఆహారాలలో ఉన్న యూరిక్ యాసిడ్ దీనికి కారణం అవుతుంది. రక్తంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉండటాన్ని హైపర్యూరిసెమియా అంటారు. ఇది గౌట్,  కిడ్నీలో రాళ్లకు కారణమవుతుంది. యూరిక్ యాసిడ్ ప్యూరిన్ అనే మూలకం నుండి తయారవుతుంది. తినే కొన్ని ఆహారాలలో  ప్యూరిన్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి చాలావేగంగా పెరిగి శరీరంలో కీళ్లు, మూత్రపిండాలకు నష్టం కలుగుతుంది.


జంతువుల మాంసం చాలామంది తింటారు. వీటిలో ముఖ్యంగా కాలేయం, మూత్రపిండాలు వంటి ప్రత్యేక అవయవాలను తినడం చాలామంది గొప్పగా ఫీల్ అవుతారు. ఆల్రెడీ యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు ఈ ప్రత్యేక అవయవాల మాంసానికి దూరంగా ఉండాలి.

సముద్ర జీవులలో కొన్ని రకాల చేపలు, నత్తలు,  యండ్రకాయలు వంటి వాటిలో ప్యూరిన్ లు ఎక్కువగా ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ స్థాయిలు పెంచుతాయి.

గొడ్డుమాంసం, పంది మాంసం, గొర్రె మాంసంలో కూడా ప్యూరిన్లు పెద్ద మొత్తంలో ఉంటాయి.  వీటిని తినడం సమస్యను పెంచుకున్నట్టు అవుతుంది.

ఆల్కహాల్ లో ప్యూరిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఏ రకమైన వైన్ అయినా, బీర్ అయినా యూరిక్ యాసిడ్ పెరుగుదలకు కారణం అవుతుంది. ఆల్కహాల్ తీసుకునేవారిలో మూత్రపిండాలు వేగంగా చెడిపోవడానికి ఇదే కారణం.

శీతల పానీయాలు తియ్యగా ఉంటాయి అనుకుంటారు. కానీ అధిక ప్రక్టోజ్ కార్న్ సిరప్ లు, చక్కెర పానీయాలు యూరిక్ యాసిడ్ స్థాయిలను వేగంగా పెంచుతాయి. ముఖ్యంగా మార్కెట్లో లభించే శీతల పానీయాలు, ప్లేవర్డ్ డ్రింక్స్ లో ఇది అధికం.

ఎండిన బీన్స్, బఠాణీలు, కాయధాన్యాలు, ఆస్పరాగస్, బచ్చలికూర, క్యాలీఫ్లవర్, పుట్టగొడుగులు వంటి కొన్ని కూరగాయలలో కూడా ఇతర కూరగాయలకంటే అధిక మొత్తంలో ప్యూరిన్లు ఉంటాయి.

వోట్మీల్, గోధుమ ఊక వంటి కొన్ని తృణధాన్యాలు మధుమేహం ఉన్నవారికి, అధిక బరువు ఉన్నవారికి చాలా మంచివని అంటారు. కానీ వీటిలో  ప్యూరిన్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కవగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్  చాలా వేగంగా పెరుగుతుంది.

                                                             *నిశ్శబ్ద.