కాశ్మీర్, జార్ఖండ్ తొలివిడత పోలింగ్

 

జమ్ము కాశ్మీర్, జార్ఖండ్ శాసనసభలకు తొలిదశ ఎన్నికలు మంగళవారం నాడు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ప్రారంభమయ్యాయి. ఎన్నికలను బహిష్కరించాలని తీవ్రవాద సంస్థలు, మావోయిస్టులు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాశ్మీర్‌లో తొలిదశ ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాలలో ఏడుగురు మంత్రులు పోటీ చేసిన స్థానాలు కూడా వున్నాయి. జమ్ము కాశ్మీర్‌లో అధికారంలో వున్న నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఈసారి పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీతోపాటు కాంగ్రెస్, బీజేపీ నుంచి కూడా పోటీని ఎదుర్కొంటోంది. అలాగే జార్ఖండ్‌లో బీజేపీ నుంచి ఎదురవుతున్న సవాల్‌ని ఎదుర్కొంటూ మళ్ళీ అధికారంలోకి రావడానికి హేమంత్ సోరెన్ నాయకత్వంలోని జార్ఖండ్ ముక్తిమోర్చా పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. జమ్ము కాశ్మీర్‌ రాష్ట్రంలో పదిన్నర లక్షల మంది ఓటర్లు, జార్ఖండ్‌లో దాదాపు 34 లక్షల మంది ఓటర్లు ఈ తొలిదశ పోలింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం వుంది.