జీహెచ్ఎంసీ పరిధిలో వాల్ పోస్టర్లపై నిషేధం

భాగ్యనగరంలో గోడలపై వాల్ పోస్టర్లు అంటించడాన్ని నిషేధిస్తూ గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ అమ్రపాలి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేషేధం ఏమీ ఈరోజు విధించినది కాదు. ఎప్పుడో 2016 నుంచే భాగ్యనగరంలో గోడలపై వాల్ పోస్టర్లు, అడ్డర్టైజ్ మెంట్లు, పెయింటింగ్ లపై నిషేధం ఉంది. అయితే ఆ నిషేధాన్ని అమలు చేసే విషయంలో ఇప్పటి వరకూ ఎవరూ ఎటువంటి శ్రద్ధా పెట్టలేదు. ఇప్పుడు జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి నగరంలోని గోడలపై పోస్టర్లు, పెయింటింగ్ లు, అడ్డర్టైజ్ మెంట్లు కనిపించకూడదంటూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సినిమా పోస్టర్లు కూడా ఈ నిషేధం కిందకి వస్తాయి. ఇందుకు సంబంధించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన జీహఎచ్ఎంసి కమిషనర్ అమ్రపాలి.. దీనిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

అంతే కాకుండా నిషేధాన్ని ఉల్లంఘించి నగరంలో గోడలపై వాల్ పోస్టర్లు అంటించినా, పెయింటింగ్ లు, అడ్డర్టైజ్ మెంట్లు కనిపించినా భారీ జరిమానా విధిస్తామని, ఈ మేరకు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు, సినిమా ఎగ్జిబిటర్లకు అవగాహన కల్పించాల్సిందిగా అమ్రపాలి అధికారులను ఆదేశించారు.   ఈ ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని, ఈ విషయాన్ని పోస్టర్ ప్రింటింగ్ ఏజెన్సీలకు నోటీసు ద్వారా తెలియజేయాల్సిందిగా అధికారులను  ఆదేశించారు.

పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు కారణంగా నగరం అందవికారంగా అపరిశుభ్రంగా కనిపిస్తున్నది అనడం వాస్తవం. నగరంలోని గోడలపై పోస్టర్లు నిషేధించడాన్ని నగర వాసులు స్వాగతిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా పోస్టర్లను తొలగించి నగరం  సుదరంగా కనిపించేలా చేయాలని కోరుతున్నారు.