కేజ్రీవాల్ ముచ్చట తీరుతోంది
posted on May 23, 2014 2:15PM
.jpg)
బీజేపీ నేత నితిన్ గడ్కారీ పై అవినీతి ఆరోపణలు చేసినందుకు జైలుపాలయిన మాజీ డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి డిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు మరో 14రోజులు జ్యూడిషియల్ రిమాండ్ పొడిగించింది. మొన్న కోర్టులో ఆయనను హాజరు పరిచినప్పుడు కోర్టు ఆయనకు రూ.10,000 పూచీకత్తుపై బెయిలు మంజూరు చేస్తానని చెప్పినప్పుడు కేజ్రీవాల్ పూచికత్తుపై బెయిలు పొందేందుకు నిరాకరించడంతో ఆయనకు కోర్టు మూడు రోజులు రిమాండ్ విదించింది. మళ్ళీ ఈరోజు కోర్టులో ఆయనను ప్రవేశపెట్టినప్పుడు స్వయంగా ఆయనే తన కేసుని వాదించుకొన్నారు. అయితే ఈసారి కూడా ఆయన బెయిలు కోరకపోవడంతో కోర్టు ఆయనకు మరో 14రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విదించి, కేసును వచ్చేనెల 6కి వాయిదా వేసింది. పోలీసులు మళ్ళీ ఆయనను తీహార్ జైలుకి తరలించారు. ప్రజలు ఆయనను డిల్లీకి ముఖ్యమంత్రిని చేసి పాలించమని కోరితే, దానిని తృణీకరించిన ఆయన తీహార్ జైలులో ఉండేందుకే ఇష్టపడుతున్నట్లున్నారు. కోర్టు కూడా ఆయన ముచ్చటను కాదనడం దేనికని రిమాండ్ పొడిగించింది. బహుశః మళ్ళీసారి కోర్టుకి హాజరయినప్పుడు బెయిలు కోసం అర్దిస్తారేమో.